V6 News

అసమానతలు పెరుగుతుంటే.. కార్పొరేట్ దిగ్గజాల ఆస్తులు పెరుగుతున్నయి !

అసమానతలు పెరుగుతుంటే.. కార్పొరేట్ దిగ్గజాల ఆస్తులు పెరుగుతున్నయి !

కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు  అప్పుల  ఊబిలో  కూరుకుపోతే  కార్పొరేట్ దిగ్గజాలు ఎలా  ప్రపంచ కుబేరులుగా మారుతున్నారనేది  ప్రధాన ప్రశ్న.  కేంద్ర ప్రభుత్వం అప్పులు రూ. 160 లక్షల కోట్లు కాగా అన్ని రాష్ట్రాలు కూడా తరతమ బేధాలు లేకుండా అప్పులు రూ. లక్షల కోట్లలోనే ఉండటం ప్రభుత్వ చట్టాల ఉదాసీన, నిర్లక్ష్యానికి నిదర్శనం.

సంపన్నులపై పన్నులు వేయకుండా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు ఏటీఎంలుగా కొనసాగడం ప్రభుత్వాల దిగజారుడుతనానికి  నిదర్శనం. గత 11 సంవత్సరాల నుంచి మోదీ ఆనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్పొరేట్లకు కామ ధేనువుగా మారాయి. వడ్డించే వాడు మనవాడైతే  బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే అనేలాగ అనుకూల గుజరాత్ రాష్ట్ర అదానీ గ్రూపు ఆరేండ్లలోనే సంపద 625 శాతం పెరుగుదలను ఆర్థికవేత్తలు ఎవరైనా ఊహించగలరా !

ఉచితాలతో అధికార పీఠం కైవసం
మొదటి శ్రేణిలో ఉన్న అంబానీ ఆరేండ్లలో 153 శాతం మాత్రమే పెరుగుదల ఉండటంతోనే  అంబాని కంటే  అదాని  మొదటి శ్రేణికి ఎదిగారు.  ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?’  అనే సామెత  అదానీకి అక్షరాల వర్తిస్తుంది. ప్రధానంగా  నేడు  అదానీ, అంబానీ  అదే రీతిలో  సావిత్రి జిందాల్,  సునీల్‌‌‌‌మిట్టల్,  శివనాడార్​ కుటుంబాల  సంపద  అనేక ఇంతలైంది. 

ఇదంతా వెల్లడించినది 2014– 2025 మధ్య కాలంలో సీఎఫ్ఐ, ట్యాక్స్ ది టాప్ సంస్థల గణాంకాలు. అయితే వీరిపైన పన్నులు ప్రత్యేకంగా విధించడానికి  భిన్నంగా వెసులుబాటు  కల్పించడం. అంతేగాకుండా సహజ వనరులను కట్టబెడుతున్నారు. పన్నులు విధిస్తే ఏటా రూ.10.63 లక్షల కోట్లు ప్రభుత్వానికి అందుతాయి. 

ఇట్టి ఆదాయంలో పేదరికంతో అల్లాడుతున్న అనేక మంది అన్నార్తులకు ఆహారం,  వృద్ధాప్య  పెన్షన్లు, పేదల పిల్లలకు ఉచిత విద్య, వైద్యానికి  ఖర్చు చేయడానికి  వెసులు బాటు ఉంటుంది. 

రాజ్యాంగంలో పొందుపరచినవిధంగా కూడు, గూడు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన పాలకులు కేవలం ఓట్లకు లింక్‌‌‌‌ పెట్టి ప్రజలను పరాన్నజీవులుగా ఉండే స్థితికి నెట్టివేస్తున్నారు.

ఉచితాలనే ఉపాయంతో అధికార పీఠాన్ని  కైవసం చేసుకొని ఊరేగడం దారుణం. మన దేశంలో  సంపదంతా కొద్దిమంది చేతుల్లోనే  కేంద్రీకృతం కావడం  భవిష్యత్  భారతావనికే  కళంకం. ప్రపంచంలో పేరు ప్రతిష్టలు, రత్నాల గర్భం అనే పేరొందిన ఈ దేశంలో పేదరికం ఉండటం పాలకుల దుర్నీతికి నిదర్శనం.

కేరళంలో 0.25 శాతం తగ్గిన పేదరికం
నేడు  కేరళంలో  పేదరికం 0.25  శాతానికి  తగ్గడమంటే అక్కడి పాలకుల చిత్తశుద్ధికి పేదల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం.  అన్ని  రాష్ట్రాలలో  పేదరిక నిర్మూలన పథకాలు ఎందుకు చిత్తశుద్ధితో అమలుపరచడం లేదనే అంశంపై విజ్ఞులు నిలదీయాలి. పాలకుల తీరు చూస్తుంటే కాకులకు కొట్టి గద్దలకు వేసినట్లుగా దేశ సంపదను గుప్పెడు మంది కార్పొరేట్ దిగ్గజాలకు వత్తాసు పలకడం హేయమైన చర్యగా భావించాలి.

ఒకవైపు సంపన్నులు మరింతగా సంపదను పెంచుకుంటుంటే, మరోవైపు సామాన్యులు అంతకంతకు పేదరికంతో  కుదేలవుతున్నారు. ఎనలేనివిధంగా పెరిగిన సంపద అసమానతలను సరి చేయాలంటే, సంపద పన్ను, వారసత్వ పన్ను విధించటమే మార్గం. అలాగే కార్పొరేట్ పన్నులను గతంలో  తగ్గించిన మొత్తాన్ని పునరుదర్ధరించాలి. తద్వారా వచ్చే నిధులను సంక్షేమ పథకాలకు వినియోగించాలి.  

ప్రజలే న్యాయ నిర్ణేతలు
మోదీ  ప్రభుత్వం పేదల నోటికాడి కూడును  లాక్కునే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పథకానికి  మార్పుల పేరుతో చట్టం తెచ్చి నిర్వీర్యం చేయడం దుర్మార్గం. ఇప్పటికే  జిఎస్‌‌‌‌టి  పేరుతో పన్నులను ఆర్థిక వనరులను కేంద్రీకృతం అయితే,  మరోవైపు రాష్ట్రాలు ఏ పథకానికి  ఖర్చు చేయాలని కూడా  కేంద్రం నిర్దేశించటం విచిత్రం. ఇది ముమ్మాటికీ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. 

ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. కాబట్టి వారే కండ్లు తెరవాలి. వాస్తవాలు గ్రహించాలి. లేకపోతే గత ఆదిమ సమాజ స్థితిగతులే  పునరావృతమయ్యే పరిస్థితి ఉంది. రాజకీయాలలో ఆసక్తికరమైన ఆధిపత్య పోరు జరుగుతున్నది. ఎవరి వద్ద ప్రజల ఎజెండా ఉన్నదనే దానిపై లోతుగా అధ్యయనం జరగాలి.  మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక, మతోన్మాద, ఫాసిస్టు విధానాలను ఎండగట్టేందుకు  ప్రతి పౌరుడు  కంకణబద్ధులు కావాలి.

చాడ వెంకటరెడ్డి, సీపీఐ సీనియర్ నాయకుడు

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.