
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యలతో ఆ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా తేలిపోయిందని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని రాంచందర్ రావు రాష్ట్రంలో చెప్తూనే.. ఢిల్లీకి వెళ్లగానే మాటమార్చాడని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.
మైనార్టీ రిజర్వేషన్లను అడ్డంపెట్టుకొని బీసీలకు అన్యాయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలది, కేంద్ర మంత్రులదేనని స్పష్టం చేశారు. సొంత పార్టీని ఒప్పించలేని బీజేపీ నేతలు తమను విమర్శించడం చేతగాని తనమేనని ధ్వజమెత్తారు.