- కిలో రైస్లో 94 మైక్రో గ్రాముల అవశేషాలు: డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్
- మన ఒంట్లో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు.. తింటున్నది 1.06 మైక్రో గ్రాములు
- పిల్లల ఒంట్లోకి 1.27 మైక్రోగ్రాములు చేరుతున్న ఆర్సెనిక్
- వండే పద్ధతులు మారాలన్న డబ్ల్యూహెచ్‌వో.. అన్నంలో గంజి వంపాలని సూచన
- వరి పంటకు నిత్యం నీళ్లు పెట్టకుండా.. ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్ పద్ధతి పాటించాలని సిఫార్సు..
- అలా అయితే ఆర్సెనిక్ ముప్పును 50 నుంచి 70 శాతం తగ్గించొచ్చని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మనం తినే ఆహారంలో పెస్టిసైడ్ల అవశేషాలపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. బియ్యం, చేపలు తదితర ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా మనం ఎక్కువగా తీసుకునే బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు అధికంగా నమోదైనట్లు పేర్కొంది. దీర్ఘకాలం అధిక మోతాదులో ఆర్సెనిక్ శరీరంలోకి చేరితే గుండె, మూత్రపిండాలు, చర్మం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇండియా సహా వివిధ దేశాల్లోని ఆహారం, బియ్యం తదితర వాటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌లోని జాయింట్ ఎక్స్పర్ట్ కమిటీ.. ఆహారంలోని విష పదార్థాలపై స్టడీ చేసింది. మన దేశంలో కోల్‌కతాను స్టడీ కోసం ఎంచుకున్నది. ఆ స్టడీలోనే బియ్యం, చేపలు, కూరగాయలు సహా చాలా ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ స్థాయికి మించి ఉన్నట్టు తేలింది. ఇన్నాళ్లూ నీళ్లలోనే ఆర్సెనిక్ ఉంటుందని భావిస్తున్నా.. ఆ నీళ్లలోనే పండే వరిలోనూ దాని ఆనవాళ్లున్నాయని పేర్కొంది.
ఎక్కువకాలం నీళ్లలోనే ఉండడం వల్ల.. వరి పైర్లు నీళ్లలోని ఆర్సెనిక్‌ను పీల్చేసుకుంటున్నాయని, ఫలితంగా బియ్యంలోకి చేరి మన కంచంలోకి కూడా వచ్చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆర్సెనిక్ ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే.. గుండె జబ్బులు పెరిగిపోవడంతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోవడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. అవే కాదు.. చర్మ వ్యాధులు కూడా వస్తున్నట్టు తేల్చారు. చర్మ క్యాన్సర్, గ్యాంగ్రీన్ వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయని గుర్తించారు.
సేఫ్ స్థాయి దాటేసి..
మామూలుగా ఆర్సెనిక్ స్థాయిలు కిలోకు 0.3 మైక్రోగ్రాముల మేర ఉన్నా.. గుండె జబ్బుల ముప్పు 0.5 శాతం పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో తేల్చింది. ఒక మైక్రోగ్రాములుంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తించింది. ఒక కిలో బియ్యంలో సగటున 100 నుంచి 112 మైక్రోగ్రాముల వరకు ఆర్సెనిక్ ఉంటున్నదని తేల్చింది. అదే మన దేశంలో సగటున 92 నుంచి 94 మైక్రోగ్రాములుగా ఉందని డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ స్పష్టం చేసింది. కాలుష్యం లేని ప్రాంతాల్లోనే పిల్లలు రోజూ 0.05 నుంచి 0.8 మైక్రోగ్రాములు, పెద్దోళ్లు 0.1 నుంచి 0.55 మైక్రోగ్రాముల వరకు ఆర్సెనిక్‌ను తినేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన 0.3 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ లిమిట్ అని రిపోర్ట్ పేర్కొంది.
నీళ్లలో ఆర్సెనిక్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం 2.5 నుంచి 175 రెట్ల వరకు ఎక్కువగా ఉంటున్నదని పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన ఇనార్గానిక్ ఆర్సెనిక్ 30 నుంచి 70 శాతం వరకు బియ్యం ద్వారానే శరీరంలోకి వెళ్తున్నదని తెలిపింది. ఇక, భూగర్భజలాల్లో ఆర్సెనిక్ 10 మైక్రోగ్రాములున్న ప్రాంతాల్లోనూ ఆ ప్రమాదం నీటిద్వారా 80 నుంచి 90 శాతం వరకు ప్రమాదం ఉందని గుర్తించింది. ముఖ్యంగా గంగానదీ పరివాహక ప్రాంతాలతో పాటు కలుషితమైన నదుల కింద పండించే పంటల్లోనూ ఆర్సెనిక్ అవశేషాలున్నట్టు గుర్తించారు. పశ్చిమబెంగాల్లో పెద్దలు కిలోకు 1.06 మైక్రోగ్రాములను తింటుంటే.. పిల్లలశరీరంలోకి వారికన్నా ఎక్కువగా 1.27 మైక్రోగ్రాములు వెళ్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, రిపోర్టులో మన రాష్ట్రం ప్రస్తావన లేకున్నా.. ఇక్కడ కూడా వరి పంట ఎక్కువే కావడం.. మూసీ పరివాహకంలో పండే పంటలపైనా ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నివారణకు డబ్ల్యూహెచ్‌వో చేసిన సూచనలు..
- మన ఒంట్లోకి ఆర్సెనిక్ చేరకుండా ఉండేందుకు డబ్ల్యూహెచ్‌వో పలు సూచనలనూ చేసింది. ముందుగా వండే పద్ధతిని మార్చాలని స్పష్టం చేసింది.
- బియ్యాన్ని రెండుమూడుసార్లు శుభ్రంగా కడగాలి.. ప్రస్తుత రోజుల్లో జనాలు గంజి వంపడమే మానేశారు. కుక్కర్లలో పెట్టేసి వండుతున్నారు. అయితే, గంజిని వంపేయాలి. దాని వల్ల ఆర్సెనిక్ ముప్పును 50 నుంచి 70 శాతం వరకు తగ్గించొచ్చు.
- తవుడులో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పాలిషింగ్ చేస్తే ముప్పు కొంత తగ్గుతుంది. అయితే, పాలిషింగ్ చేయడం వల్ల పోషకాలు పోతాయి కాబట్టి.. దానిని నివారించేందుకు ‘హాట్‌వాటర్ పర్కొలేషన్’ అనే పద్ధతిని వాడాలి .
- వ్యవసాయంలోనూ మార్పులు చేయాలి. వరి పొలాల్లో ఎల్లప్పుడూ నీటిని నిల్వ ఉంచొద్దు. ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్ పద్ధతిని పాటించాలి. దాని వల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు 50 శాతం వరకు తగ్గుతాయి. సిలికాన్ ఎరువులు వాడడం ద్వారా వరి పైరు ఆర్సెనిక్‌ను పీల్చుకోకుండా నివారించవచ్చు.
