న్యూఢిల్లీ: కూరగాయల వంటి వాటి ధరలు తగ్గడంతో కిందటి నెలలో టోకు ధరల (హోల్‌సేల్) ద్రవ్యోల్బణం 2.31 శాతానికి తగ్గింది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) 2024 డిసెంబరులో 2.34 శాతంగా నమోదయింది.
ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం 8.47 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గింది. కూరగాయల ద్రవ్యోల్బణం 28.65 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. గుడ్లు, మాంసం, చేపల విషయంలో ఇది 5.43 శాతం నుంచి 3.56 శాతానికి పడిపోయింది. టమాటాలు, ఇంధనం ధరలు తగ్గగా, ఉల్లిపాయల ధరలు పెరిగాయి.
మానుఫ్యాక్చర్డ్ ఐటెమ్స్ ద్రవ్యోల్బణం 2.14 శాతం నుంచి 2.51 శాతానికి పెరిగింది. ఈసారి రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టం 4.31 శాతంగా నమోదయింది. 2025లో టోకు ద్రవ్యోల్బణం 2.4 శాతంగా, 2026లో ఇది మూడు శాతంగా ఉండవచ్చని ఇక్రా తెలిపింది.
