పశ్చిమాసిలో రెండు వారాలపాటు యుద్దాన్ని నిలిపివేస్తూ ఇరాన్, అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఈ సంక్షోభానికి సెంటర్ ఆఫ్ పాయింట్ అయిన హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అటు ఇరాన్ , ఇటు ట్రంప్ ఇద్దరూ ఇప్పుడు పోటీ పడుతున్నారు. కాల్పుల విరమణ నిబంధనల ప్రకారం.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అనుమతించినప్పటికీ హార్ముజ్ పై పెత్తనం నాదే అంటే అంటూ.. ఇరాన్ , అమెరికా పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి.
సీజ్ ఫైర్ ఒప్పందంకోసం ఇరాన్ తన 10 షరతులలో హార్ముజ్ గుండా నౌకాయనం కూడా ఉంది. నౌకల రాకపోకలపై హామీతో కూడిన నియంత్రణ కల్పించాలని, చమురు, ఇంధన సరఫరాకోసం సురక్షితమైన ఓనియమావళిపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
హార్ముజ్‌ను ఇరాన్ నియంత్రించనుందా?..
మీడియా రిపోర్టుల ప్రకారం..ఇరాన్, ఒమన్‌తో సమన్వయం చేసుకుని, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై పన్నులు విధించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఆదాయాన్ని టెహ్రాన్ పునర్నిర్మాణ పనుల కోసం ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు.ఈ జలమార్గం గుండా నౌకల రాకపోకలు ఇరాన్ సైన్యం నియంత్రణలో ఉంటాయని, నౌకల ప్రయాణం సమన్వయంతో, నియంత్రిత పద్ధతిలో నిర్వహించబడుతుందని కూడా మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇరాన్ గొప్ప విజయాన్ని సాధించింది.. తన10-సూత్రాల ప్రణాళికను అంగీకరించేలా అమెరికాను బలవంతం చేసింది.. ఈ యుద్దంలో తామే విజయం సాధించామంటూ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ప్రకటించింది.
హార్ముజ్‌పై మాదే అంటున్న ట్రంప్..
ఇరాన్ ప్రకటించుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హార్ముజ్ మాదే అంటూ ప్రకటనచేశారు. యుద్ధంలో విజయం సాధించాం.. ఇది సంపూర్ణ విజయం.. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని ఏఎఫ్ ఫీతో ట్రంప్ చెప్పారు. రెండు పక్షాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల తర్వాత, ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ట్రంప్ మాట్లాడుతూ..హోర్ముజ్ జలసంధిలో పేరుకుపోతున్న రద్దీని తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ సహాయం చేస్తుందని చెప్పారు.
హోర్ముజ్ జలసంధిలో రవాణా పునరుద్ధరణకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహాయం చేయనున్నాయి. దీనివల్ల ఎన్నో సానుకూల చర్యలు ఉంటాయి! భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు," అని ట్రంప్ రాశారు.
కాల్పుల విరమణలో తదుపరి దశగా, ఏప్రిల్ 10న పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాల మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఒప్పందం తుది నిబంధనలను ఖరారు చేయనున్నారు. అమెరికా కూడా ఇరాన్ ముందు తన డిమాండ్లను ఉంచుతుందని భావిస్తున్నారు. వాటిలో అణు ,బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయడం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో టెహ్రాన్ ఈ రెండింటినీ తిరస్కరించడం, చివరికి యుద్ధానికి దారితీసింది.
