ప్రైవేట్​ స్కూళ్లలో పేద పిల్లలకు 25% సీట్లు ఎందుకు కేటాయిస్తలేరు?

ప్రైవేట్​ స్కూళ్లలో పేద పిల్లలకు 25% సీట్లు ఎందుకు కేటాయిస్తలేరు?
  • విద్యా హక్కు చట్టం అమలుఇదేనా?:  హైకోర్టు ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్​ స్కూళ్లలో పేద పిల్లలకు 25% సీట్లు ఎందుకు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలు ఇదేనా? అని ఫైర్ అయ్యింది.  కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటి వరకు  పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్​చేయలేదని ప్రశ్నించింది. చట్టం అమలు చేస్తే ఆ వివరాలను ఎందుకు సమర్పించలేదని నిలదీసింది. విద్యాహక్కు చట్టం అమలుపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాల్​ చేస్తూ లాయర్‌‌‌‌ యోగేశ్ దాఖలు చేసిన పిల్‌‌‌‌ను.. చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జే.అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించింది. పిటిషనర్‌‌‌‌ అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్‌‌‌‌ 121సీ ప్రకారం.. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు చట్టం అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే  రెండుసార్లు కౌంటర్లు దాఖలు చేసినా ఎంత మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారనే  వివరాలు సమర్పించలేదన్నారు. 

ప్రభుత్వ ప్రత్యేక అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. పేదలకు విద్యావసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది. మరో పిటిషన్‌‌‌‌లో గవర్నమెంట్‌‌‌‌ హాస్టల్స్, గవర్నమెంట్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌లో సౌకర్యాల లేమిపై వివరణ ఇవ్వాలంది. స్కూల్స్, హాస్ట ల్స్‌‌‌‌లో సౌకర్యాలు లేకపోవడంపై కే.అఖిల్‌‌‌‌ శ్రీగురు తేజ దాఖలు చేసిన పిల్‌‌‌‌పై విచారణను కూడా రెండు వారాలకు వాయిదా వేసింది.