
- కరూర్ తొక్కిసలాట ఘటనపై ‘సిట్’ దర్యాప్తుకు ఆదేశం
చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో గత వారం తొక్కిసలాట ఘటన సందర్భంగా టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్‌తో పాటు ఆయన పార్టీ నేతలు ఎందుకు వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారు కనీస పశ్చాత్తాపం లేకుండా, బాధితులకు సహాయం చేయకుండా అక్కడి నుంచి పారిపోయారంటూ తప్పుపట్టింది. విజయ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మెతకవైఖరి అవలంబించిందని అభిప్రాయపడింది. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోయిన నెల 27న కరూర్ లో తమిళ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో 41 మంది చనిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు చెందిన ఐదుగురు నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్టీ జిల్లా సెక్రటరీ మతియళగన్, మరో నాయకుడు మసీ పౌన్ రాజ్ ను అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కేసులోని మిగతా ముగ్గురు నిందితులు టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్, జిల్లా సెక్రటరీ సతీశ్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ లు దాఖలు చేయగా.. శుక్రవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ జడ్జి జస్టిస్ సెంథిల్ కుమార్ వాటిని విచారించారు. సతీశ్ కుమార్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన జడ్జి.. మిగతా ఇద్దరు నిందితుల పిటిషన్లపై తీర్పును వాయిదా వేశారు.
సిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు..
తొక్కిసలాట ఘటనపై సీబీఐ ద్వారా లేదా సిట్ ద్వారా విచారణ చేయించాలంటూ టీవీకే దాఖలు చేసిన పిటిషన్‌నూ జస్టిస్ సెంథిల్ కుమార్ విచారించారు. దీనిపై సీబీఐ దర్యాప్తును తిరస్కరిస్తూ.. సిట్ దర్యాప్తుకు ఆదేశించారు.