
- ‘రైతు గర్జన’లో భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి మోహన్ మిశ్రా
- పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న సోయి ఇక్కడున్నోళ్లపై లేదు
హైదరాబాద్, వెలుగు: రైతు వ్యతిరేకి సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నేషనల్ జనరల్ సెక్రటరీ మోహిని మోహన్ మిశ్రా మండిపడ్డారు. రెండో సారి అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు కావొస్తున్నా ఇంత వరకు రుణమాఫీ చేయడం లేదన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారతీయ కిసాన్ సంఘ్(తెలంగాణ శాఖ) ఆధ్వర్యంలో జరిగిన రైతు గర్జనకు మిశ్రా హాజరై మాట్లాడారు. ‘‘ రాష్ట్రంలో ఎన్ని విపత్తులు సంభవించినా రైతులకు పంటనష్ట పరిహారం ఇవ్వటం లేదు. ఫసల్ బీమా స్కీం అమలు చేయడం లేదు. సర్కార్కు అనుకూలంగా ఉండే పక్క రాష్ట్రాల రైతులను ఇక్కడికి పిలిపించి వారితో గొప్పులు చెప్పించుకుంటున్నరు తప్ప ఇక్కడి రైతుల గోసను పట్టించుకోవడం లేదు” అని ఆయన ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న ప్రేమ ఇక్కడి వారిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ చేయాలన్నారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ పోరాట ఫలితంగానే రైతు పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే చట్టం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వడ్ల కొనుగోలులో తరుగు పేరుతో దోచుకుంటున్నా సీఎం పట్టించుకోవటం లేదని, దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని గుర్తు చేశారు.
రైతుకు రూపాయి కూడా మిగలట్లేదు
కష్టపడి పంటలు పండించిన రైతుకు రూపాయి కూడా మిగలడం లేదని, అప్పుల పాలవుతున్నారని రైతునేత అంజిరెడ్డి అన్నారు. ప్రాజెక్టులకు భూమి తీసుకుంటే మరో చోట భూమి ఇవ్వకుండా తక్కువ పరిహారం ఇస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ధరణి రైతుల బతుకులను నాశనం చేసిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, మన పిల్లల పేరు మీద కూడా లక్షన్నర అప్పు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సమావేశానికి వివిధ జిల్లాల నుంచి 20వేల మంది వరకు రైతులు హాజరయ్యారు.