శ్రీరామనవమి వచ్చిందంటే రామయ్య భక్తులందరూ భద్రాచలానికి క్యూ కడతారు. దేశమంతటా రాములోరి పెళ్లిళ్లు భక్తులు ఘనంగా చేస్తుంటే.. మరి భద్రాలానికి ఎందుకంత ప్రాముఖ్యత.. రామయ్య పెళ్లికి భద్రాచలానికి ఉన్న సంబంధం ఏమిటి.. ఆ క్షేత్రానికే ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది.. మొదలగు విషయాలును ఈ స్టోరీలో తెలుసుకుందాం..
భద్రాద్రి రాముడి విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడి శ్రీరామనవమి వేడుకలకి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం చేస్తారిక్కడ. ఇక్కడి కల్యాణ ముహూర్తమే అందరికీ కొలమానం. అందరూ అదే ముహూర్తాన సీతారాముల కల్యాణం చేస్తారు. అయితే భద్రాచలానికి మరో విశిష్టత కూడా ఉంది. రాములోరి లగ్గానికి ముహుర్తం పెట్టింది కూడా ఈ పుణ్య క్షేత్రంలోనే.
శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజేకాడు. పుట్టిన రోజు కూడా. చైత్ర శుద్ధ నవమి నాడు రాముడు పుట్టాడు. రాముడి పుట్టిన రోజే పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. శ్రీరాముడి పుట్టిన రోజునే పెండ్లి రోజుగా నిర్ణయం చేసింది భక్తరామదా సు. రాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కల్యాణం జరగడానికి మూలకారకుడు ఈయన. ఈ గొప్ప కార్యానికి భద్రాచలంలోనే బీజం పడింది.
400 ఏళ్ల క్రితం
నాలుగొందల ఏళ్ల క్రితం భక్తరామదాసు రాముడి పెండ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడమని పండితుల్ని కోరాడు. భద్రాచలం రామాలయంలో పూజాది కార్యక్రమాలు అన్నీ పాంచరాత్ర ఆగమం ప్రకారం (శ్రీరంగం సంప్రదాయం) జరుగుతాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. అదే చైత్రశుద్ధ నవమి.
అవతార పురుషులు, దివ్యమూర్తుల కళ్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం "ఎస్య అవతార దివసే . తస్య కల్యాణ ఆచరేత్" (పరమ పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కల్యాణం చేయడం. రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి అవడం వల్ల రాముడి కల్యాణం ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.
దోషరహిత ముహూర్తం.. గడ్డపార ముహూర్తం
అయితే వాల్మీకి రామాయణంలో... పద్మ పురాణంలో రాముడి కల్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై, చైత్రశుద్ధ నవమిరోజున ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి.
ఆ ముహూర్త నిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా ఆ ముహూర్త సృష్టికర్త భక్తరామదాసు భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. అభిజిత్ లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే టైం. ఇది దోషరహిత ముహూర్త సమయం. దీనినే గ్రామాల్లో 'గడ్డపార ముహూర్తం' అంటారు.
