ఖాళీలుంటే నోటిఫికేషన్లు  ఎందుకియ్యరు?

ఖాళీలుంటే నోటిఫికేషన్లు  ఎందుకియ్యరు?
  • బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటున్న ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎందుకియ్యడం లేదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 90 ఏళ్లుగా బీసీ జనాభా లెక్కింపు జరగడం లేదని, దీనిపై  కేంద్రానికి లేఖ రాయడానికే సీఎం కేసీఆర్ పరిమితమయ్యారని విమర్శించారు. ‘రాజ్యాధికారంలో బీసీల పాత్ర’ పై బీఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.  ఆయన  మాట్లాడుతూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2,433 కోట్లు ఇస్తానని, కేవలం 7 కోట్లే ఇచ్చాడన్నారు.  కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో ఎందరు బీసీలకు అవకాశమిచ్చారో  కేసీఆర్ చెప్పాలని డిమాండ్​ చేశారు.  ఏడేండ్ల పాటు నిద్రపోయి, ఇప్పుడు రూ.2,000 కోట్లతో దళిత బంధు అంటూ హుజూరాబాద్ లో ఈటలను ఓడించాలని చూస్తున్నారన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం మెప్పు కోసమే టీఆర్ఎస్ లీడర్లు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.