ఇరాన్లో ప్రభుత్వం మారితే భారత్కు నష్టం.. పాక్, చైనాకు లాభం.. ఎందుకంటే.. ?

ఇరాన్లో ప్రభుత్వం మారితే భారత్కు నష్టం.. పాక్, చైనాకు లాభం.. ఎందుకంటే.. ?

ఇరాన్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక, రాజకీయ అనిశ్చిత్తితో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో ఇప్పటికే 2,400 మందికిపైగా పౌరులు చనిపోయారు. మరోవైపు ఆందోళనకారులకు మద్ధతుగా అమెరికా నిలవడంతో.. అక్కడ అధికార  మార్పు జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ లో అధికార మార్పు ఇండియాకు నష్టం చేకూరుస్తుందని.. పాకిస్తాన్, చైనాకు లాభం కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకో చూద్దాం.

ఇరాన్ తో భారత్ కు ఎన్నో ఏళ్ల వాణిజ్య సంబంధం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు రవాణా దారులను పాకిస్తాన్ అడ్డుకుంటున్న ప్రతీసారీ.. భారత్ కు వెస్ట్రన్ కారిడార్ లో ఉన్న ఏకైక మార్గం ఇరాన్. అక్కడున్న షియా నాయకత్వం కూడా ఇటు పాకిస్తాన్, చైనాలను బ్యాలన్స్ చేస్తూనే భారత్ తో  సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితులో ఇరాన్ అధికారం మారినా.. రాజకీయంగా నిర్వీర్యం అయినా అది భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ లో అధికార మార్పుతో ఆదేశంతో సంబంధాలు దాదాపు దెబ్బతిన్నట్లుగానే తయారైంది పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్ర సవాళ్లు, చైనా దురాక్రమణలు, ట్రంప్ పాలసీల కారణంగా అమెరికాతో ఇబ్బందులు.. ఇలాంటి సవాళ్ల మధ్య ఇరాన్ లో రాజకీయ మార్పు భారత్ పై ప్రతికూల ప్రభావం చూపే అంశం.

ఇరాన్ భారత్ కు ఎందుకు ముఖ్యం:

ఛాబహార్ పోర్టు:

ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు మార్గాలను పాకిస్తాన్ బ్లాక్ చేస్తున్నందు వలన.. ఇరాన్ భారత్ కు అత్యంత విశ్వసనీయమైన పార్టనర్ గా ఎదిగింది. ఈ క్రమంలో ఛాబహార్ పోర్టు భారత్ కు వాణిజ్య పరంగా చాలా ముఖ్యం. ఇరాన్ తీరం నుంచి మధ్య ఆసియాకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్న పోర్టు అది. ఇది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నపుడే సాధ్యం. అక్కడ ప్రభుత్వం మారి.. పాక్, చైనాలకు అనుకూల విధానలు తీసుకుంటే భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఖమేనీ ప్రభుత్వం కూలిపోతే ఆ తర్వాత ఛాబహార్ పోర్టు అత్యంత క్లిష్టతరమయ్యే అవకాశం ఉందని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రజన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్:

ఇరాన్ ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ.. పాకిస్తాన్ ప్రభావానికి లోనుకాకుండా బ్యాలన్స్ చేస్తూ వస్తోంది. ఇరాన్ లో ఉన్న షియా గ్రూప్.. పాక్ సున్నీ గ్రూప్ కు వ్యతిరేకంగా ఉంటూ ఇండియాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

1990,2000 దశాబ్దాలలో షియా నాయకత్వం భారత్ కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. పాక్ మద్ధతుతో తాలిబన్ లు ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా వాణిజ్య అవసరాలను అడ్డుకున్న తరుణంలో.. ఇరాన్- ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించి వాణిజ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ అంతర్గతంగా క్షీణిస్తే పాక్  ప్రభావం చూపించి.. భారత్ పై దెబ్బకొట్టే అవకాశం ఉంది. 

చైనా ప్రభావం:

పాక్ తో పోల్చినప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉంటూ వస్తున్న ఇరాన్.. చైనా విషయంలో మాత్రం కాస్త పాజిటివ్ గానే వ్యవహరిస్తూ వస్తోంది. 2021లో 25 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి ఈ రెండు దేశాలు. 2025 లో చైనా ఇరాన్ కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. 14.5 బిలియన్ డాలర్ల ఇరాన్ ఎగుమతులు చైనాకు వెళ్తున్నాయి. అమెరికా లాంటి దేశాల సాంక్షన్స్ ఉన్న పరిస్థతుల్లో ఇరాన్ చైనాపై ఆధారపడుతోంది. ఒకవేళ ప్రభుత్వం మారి ఇరాన్ మరింత గా చైనాపై ఆధారపడితే అది ఇండియాపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఖుజెస్తాన్ లో పవర్ ప్లాంట్స్, పోర్టు ప్రాజెక్టులకు చైనా ఆర్థిక సాయం చేస్తోంది. ఇదే మాదిరిగా ఇరాన్ అవసరాలను తీర్చుతూ ఆ దేశాన్ని గుప్పిట్లోకి తెచ్చుకుంటే ఇండియాకు మధ్యఆసియా వాణిజ్య ద్వారం క్లిష్టంగా మారే పరిస్థితి ఉంది.