మానసిక వికలాంగులను ఎందుకు పట్టించుకోవట్లేదు : హైకోర్టు

మానసిక వికలాంగులను ఎందుకు పట్టించుకోవట్లేదు :  హైకోర్టు
  •     మానసిక వికలాంగులను ఎందుకు పట్టించుకోవట్లేదు :  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : ‘మానసిక వైకల్యంతో బాధపడేవాళ్లకు ఓటు ఉండదనే వాళ్లను పట్టించుకోవడం లేదా?’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. వాళ్లకు ఓటు హక్కు ఉండి ఉంటే అన్ని సౌలత్​లు కల్పించేవాళ్లా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. జిల్లాల్లో మెంటల్ హెల్త్ కేర్ సెంటర్స్​ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ న్యూ లైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్​మెంట్ సంస్థ వ్యవస్థాపకుడు ఎం.మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎల్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసిందని, తమ సంస్థ వంద మందికి ఆశ్రయం ఇస్తున్నదని పిటిషనర్ చెప్పారు. సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017 నిబంధనలు ఏం చెబుతున్నాయో వివరించాలని పిటిషనర్​ను బెంచ్ కోరింది. విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కూడా వివరాలు అందజేయాలని సూచించింది.