Flag Hoisting Controversy: భారతదేశం ఎంతో సంతోషంగా, గౌరవంగా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బాధ్యతారాహిత్యమై ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా గాలే స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్‌కు ఆడుతున్న వేళ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణ పతాకావిష్కరణ నిర్వహించారు. కానీ ఈ సందర్భంలో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లు కేవలం ప్రాక్టీస్ షార్ట్స్ (హాఫ్ ప్యాంట్లు) ధరించి జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబించే అగ్రశ్రేణి క్రీడాకారులు జాతీయ చిహ్నాల పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం పట్ల దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీస మర్యాద మరచారా?:
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటప్పుడు దానికి తగ్గట్లు గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం.. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఫుల్ ట్రాక్‌సూట్ లేదా సాంప్రదాయ దుస్తులు ధరించి గౌరవప్రదంగా జెండాను ఎగురవేయడం కనీస నియమం. కానీ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రాక్టీస్ షార్ట్స్ వేసుకుని జెండా ఎగరేయడం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా జాతీయ పతాక గౌరవానికి భంగం కలిగించడమేనని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరులు కూడా ఇలాంటి వేడుకల్లో పద్ధతిగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తుంటే, కోట్లాది మందికి ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇంతటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంచిది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?:
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. విరాట్ కోహ్లీ లేదా ఎంఎస్ ధోని సారథ్యంలో ఉన్నప్పుడు జాతీయ వేడుకల సమయంలో ఎంతో గౌరవంగా, పూర్తిస్థాయి డ్రెస్ కోడ్‌తో వ్యవహరించేవారు. కానీ గిల్-గంభీర్ జోడీకి కనీసం జాతీయ జెండాను ఎలా గౌరవమివ్వాలో కూడా తెలియదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్టేడియంలో ఆడే ఆట ఎంత ముఖ్యమో, మైదానం వెలుపల దేశ గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని, వైట్ బాల్, రెడ్ బాల్ ఫలితాల కంటే ముందు దేశ పతాకానికి ఇచ్చే విలువను తెలుసుకోవాలని సోషల్ మీడియాలో గట్టిగా విమర్శల వర్షం కురుస్తుంది.
క్రికెట్ బోర్డు జవాబుదారీతనం వహించాలి:
గతంలో కూడా పలు సందర్భాల్లో జాతీయ చిహ్నాలు, పతాక నియమావళి (Flag Code of India) ఉల్లంఘనలపై కఠినమైన విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో బీసీసీఐ (BCCI), టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు ఇలాంటి వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న టెస్టు సిరీస్ ఆడుతున్నప్పటికీ, దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న విషయాల్లో కేర్లెస్ ఆటిట్యూడ్ చూపడం క్షమించరాని నేరం, ఈ ఘటనపై గంభీర్, గిల్లు తక్షణమే దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU
— BCCI (@BCCI) August 15, 2026
