చేయూత పింఛన్ల దరఖాస్తుదారుల్లో సగానికిపైగా వితంతువులే! రాష్ట్రంలో మొత్తం 4.81 లక్షల అప్లికేషన్లు

చేయూత పింఛన్ల దరఖాస్తుదారుల్లో సగానికిపైగా వితంతువులే! రాష్ట్రంలో మొత్తం 4.81 లక్షల అప్లికేషన్లు
  • వితంతువుల కేటగిరీలోనే 2.83 లక్షల అర్జీలు
  • తరువాతి స్థానంలో 1.16 లక్షలతో దివ్యాంగులు
  • దరఖాస్తులకు మరో 15 రోజులు పొడిగింపు
  • సర్ ప్రక్రియ నేపథ్యంలో సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌‌, వెలుగు:   ‘చేయూత’ పింఛన్ల పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి.  సోమవారంతో గడువు ముగియగా.. సర్​ 
ప్రక్రియ, దివ్యాంగుల కోరిక మేరకు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మరిన్ని అప్లికేషన్లు వస్తాయని ఆఫీసర్లు చెప్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పింఛన్ల కోసం ఇప్పటి వరకు  4,81,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సెర్ప్‌‌ పోర్టల్‌‌లో నమోదైన డేటా ఎంట్రీ వివరాల ప్రకారం.. అత్యధికంగా వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.

ఆ తర్వాత దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికుల కేటగిరీల్లోనూ గణనీయంగా దరఖాస్తులు అందాయి. మొత్తం వచ్చిన 4.81 లక్షల అప్లికేషన్లలో ఒక్క వితంతు పింఛన్ల కోసమే సగానికిపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. వితంతు పింఛన్ల కోసం  2,83,492 మంది, దివ్యాంగులు 1,16,552, ఒంటరి మహిళలు 38,452, గీత కార్మికులు 30,416, 12,750 మంది చేనేత కార్మికులు పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారు.


జిల్లాలవారీగా పరిశీలిస్తే హైదరాబాద్‌‌‌‌ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ సంఖ్యలో అప్లికేషన్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌‌లో 31,330, నల్గొండ 28,390, రంగారెడ్డి 26,941, మేడ్చల్ మల్కాజిగిరి 25,374, ఖమ్మంలో 24,820  అప్లికేషన్లు వచ్చినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. అత్యల్పంగా ములుగు 4,038 , జయశంకర్ భూపాలపల్లి 6,485, కుమ్రం భీం ఆసిఫాబాద్ 7,413, రాజన్న సిరిసిల్ల  7,753 దరఖాస్తులు నమోదయ్యాయి.  

కాగా, హైదరాబాద్‌‌లో అత్యధికంగా 21,958 మంది దరఖాస్తు చేయగా, రంగారెడ్డిలో 18,207, మేడ్చల్‌‌లో 17,363 మంది అప్లై చేశారు. దివ్యాంగుల పింఛన్ల కోసం ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7,942 దరఖాస్తులు రాగా, నల్గొండలో 7,921, కరీంనగర్‌‌లో 6,642 మంది అప్లై చేసుకున్నారు. ఒంటరి మహిళల పింఛన్​ కోసం హైదరాబాద్‌‌లో అత్యధికంగా 3,527, ఖమ్మంలో 2,394 మంది దరఖాస్తు చేశారు. చేనేత పింఛన్లు కోసం జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 2,242 దరఖాస్తులు రాగా, యాదాద్రి భువనగిరిలో 1,381 వచ్చాయి.

గీత కార్మికుల పింఛన్ల కోసం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 3,678, సూర్యాపేటలో 2,895, యాదాద్రి భువనగిరిలో 2,510 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం పోర్టల్‌‌లో నమోదైన ఈ డేటా ఎంట్రీలన్నింటినీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. గ్రామ, వార్డు సభలు, అధికారుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే తుది అర్హుల జాబితాను రూపొందించి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుంది.