
- ఫేవరెట్‌గా టీమిండియా
- కీలకంగా మారనున్న ఇరుజట్ల స్పిన్నర్లు
- రాత్రి 8 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
దుబాయ్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో మ్యాచ్ వద్దే వద్దు అంటూ దేశంలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆసియా కప్‌లో టీమిండియా హై ఓల్టేజ్ పోరుకు రెడీ అయ్యింది. ఆదివారం (సెప్టెంబర్ 14) జరిగే గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో ఉన్నంత హైప్‌లో సగం కూడా లేని ఈ మ్యాచ్‌పై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. టోర్నీ ఆతిథ్య హోదాలో ఇండియా బరిలోకి దిగనుంది.
అయితే ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్‌లో సూర్యసేననే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఫలితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇరుజట్లు నాణ్యమైన క్రికెట్ ఆడటంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు చాలా తక్కువ మంది హాజరుకావడంతో మ్యాచ్‌లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. ట్రావెలింగ్ మీడియా కూడా జట్ల ఆన్ ఫీల్డ్ బలాబలాలను పక్కనబెట్టి.. ఆఫ్ ఫీల్డ్ వివాదాలనే ఎక్కువగా హైలెట్ చేస్తోంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ ఆడటం, గెలవడం ఇరుజట్లకు కత్తిమీద
సాముగా మారింది.
ఇండియా బలం బ్యాటింగే..
ఈ మ్యాచ్ కోసం ఇండియా కూడా కొత్త వ్యూహాలను రెడీ చేసింది. అయితే బౌలింగ్ కంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పాక్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేకు ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొనే సత్తా ఉంది. దాంతో వీళ్లను ఆపే బౌలింగ్ దాడి ప్రస్తుతం పాక్ దగ్గర కనిపించడం లేదు. ఆల్‌రౌండర్ల విషయంలో ఇండియాదే పైచేయి. మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం పరంగా చూస్తే ఫహీమ్ అష్రఫ్ కంటే హార్దిక్ ఎన్నో రెట్లు ముందున్నాడు. ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ను ఎక్కడికో తీసుకెళ్లే సామర్థ్యానికి కొదవలేదు.
అదే టైమ్‌లో పాక్ లైనప్‌పై పెద్దగా అంచనాల్లేవు. జట్టు మొత్తంలో ప్రత్యేకంగా పేసర్ షాహిన్ ఆఫ్రిది గురించి మాత్రమే మాట్లాడొచ్చు. 2021లో ఈ గ్రౌండ్‌లో షాహిన్‌కు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. ఇప్పుడు ఈ ముగ్గురు లేరు కాబట్టి టీమిండియా యంగ్‌స్టర్స్.. షాహిన్‌ను ఎలా ఆడతారన్నది చూడాలి. అయితే మోకాలి సర్జరీ తర్వాత షాహిన్ బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు.
స్పిన్నర్లే.. విన్నర్లు..
సాధారణంగా ఇండో–పాక్ మ్యాచ్ అంటే టీమిండియా బ్యాటర్లు.. పాక్ పేసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ పేసర్లు బుమ్రా, షాహిన్‌ను పక్కనబెడితే స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. రెండు జట్లలో లెఫ్ట్, రైట్ రిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. వీళ్లలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి. సుఫియాన్ ముఖీమ్ మంచి బౌలరే అయినా కుల్దీప్ అంత నైపుణ్యం లేదు.
కుల్దీప్ వేసే గూగ్లీని ఆడటం ప్రపంచంలోని టాప్ బ్యాటర్లకు కూడా సాధ్యం కావడం లేదు. అబ్రార్ అహ్మద్ లెగ్ బ్రేక్‌తో ఇబ్బందిపెట్టాలని చూస్తున్నా.. వరుణ్ చక్రవర్తి ముందు తేలిపోతాడు. వరుణ్ బౌలింగ్‌లో రహస్య అస్త్రాలు చాలా ఉన్నాయి. ఇది పాక్ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారనున్నాయి. కీలక బ్యాటర్లుగా భావిస్తున్న సైమ్, ఫర్హాన్, హసన్ నవాజ్, ఫఖర్ జమాన్‌కు ఇబ్బంది తప్పదు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌పై పాక్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
కానీ అక్షర్ పటేల్‌తో పోలిస్తే చాలా రెట్లు వెనకబడి ఉన్నాడు. టీమిండియా లైనప్‌లో అక్షర్‌కు ఉన్నంత ప్రాధాన్యం.. పాక్ జట్టులో నవాజ్‌కు లేదు. దాంతో అతను తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), షాహిబ్జాద్ ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, మహ్మద్ హారిస్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.