- రైతు భరోసా, కులగణన సర్వే, ఏడాది పాలనపై చర్చించే చాన్స్
- ఆర్వోఆర్, హైడ్రా తదితర బిల్లులకు ఆమోదం తెలిపే చాన్స్
- విద్యుత్ కమిషన్ రిపోర్టునూ ప్రవేశపెట్టే అవకాశం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 9న ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అసెంబ్లీ సమావేశమైన అరగంట లోపే వాయిదా వేస్తారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఆ తరువాత ఎన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుందనేది స్పష్టత రానుంది. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాలన, ప్రోగ్రెస్రిపోర్టుపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభ ముందుకు తీసుకురానున్నారు. కేబినేట్ సబ్ కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి రైతుభరోసా విధివిధానాలను ఫైనల్చేయనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. అప్పటి వరకు కులగణన సర్వే పూర్తయి నివేదిక రావడంతో పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపును కూడా అసెంబ్లీలోనే వెల్లడించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.
మూసీపై మరోసారి చర్చ..
రికార్డ్స్ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్–2024) బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నది. హైడ్రా, ఓఆర్ఆర్దగ్గరలోని గ్రామాలు ఆయా మున్సిపాలిటీల్లో విలీనం తదితర బిల్లులపైనా చర్చించి ఆమోదించనుంది. ఇప్పటికే వీటికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. మూసీ పునరుజ్జీవంపైనా మారోసారి అసెంబ్లీలో చర్చ పెట్టాలని సర్కార్ భావిస్తున్నది. ఫోర్త్ సిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నట్టు తెలిసింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై జ్యుడీషియల్కమిషన్తో ప్రభుత్వం విచారణ చేయించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. దీంతో అసెంబ్లీ కంటే ముందు జరిగే కేబినెట్సమావేశంలో దీనిపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. అవసరమైతే అసెంబ్లీలోనూ కమిషన్రిపోర్ట్ను పెట్టే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలిసింది.
