- ఉదయం ప్రచారం, సాయంత్రం ర్యాలీలు, రాత్రి కులసంఘాలతో మీటింగ్‌లు
- అభ్యర్థుల పేర్లతో గల్లీల్లో పాటల మోత
- ప్రచారానికి మార్కులేసుకుంటున్న అభ్యర్థులు
- తిండి , నిద్రకు దూరంగా మేయర్, చైర్‌పర్సన్ రేస్‌లోని కుటుంబాలు
నిజామాబాద్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే ఉండడంతో పట్టణాల్లో ప్రచార హీట్పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. మందు, విందు, నగదు పంపిణీకి తెరలేపారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వవద్దన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. గెలుపోటములపై ప్రతి రోజు లెక్కలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఉదయం 8 గంటలకే అభ్యర్థులు, కార్యకర్తలు ఓటర్ల ఇండ్ల ముందు ప్రత్యక్షమై 11 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు. మహిళలకు రూ.300, పురుషులకు రూ.400 ఇస్తూ ప్రచారానికి తీసుకొస్తున్నారు. సాయంత్రం గల్లీల్లో ర్యాలీలు, రాత్రి అయితే చౌరస్తాల వద్ద డిజిటల్ స్క్రీన్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ, అభ్యర్థుల పేర్లతో పాటలు కంపోజ్ చేయించి మైక్‌లతో కూడిన ఆటోలను వీధుల్లో తిప్పుతున్నారు. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు నిర్వహించే కార్నర్ మీటింగ్‌లకు కనీసం 500 మందిని తీసుకొచ్చేందుకు డబ్బులు పంచేందుకు వెనుకాడడం లేదు.
టిఫిన్లు, భోజనాలు, ప్రచార ఖర్చులు కలిపితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఒక్కరోజు ఖర్చు రూ.10 లక్షలు దాటుతోంది. మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చు రూ.5 లక్షలు అవుతోందని తెలుస్తోంది. రానున్న మూడు రోజుల్లో అభ్యర్థుల ఖర్చు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాత్రిళ్లు కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆలయాల్లో కూర్చొని చర్చలు జరిపితే విశ్వాసం పెరుగుతుందన్న భావనతో దేవాలయాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
శనివారం రాత్రి నుంచే లిక్కర్ పంపిణీ షురూ అయ్యింది. ఆదివారం ఒక్కో కుటుంబానికి కిలో చికెన్ ప్యాకెట్, మందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో 714 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టికెట్లు కేటాయించగా, గెలుపు అవకాశాలు ఉండి డబ్బులు లేకపోతే పక్క డివిజన్ల నుంచి ఫండింగ్ చేయిస్తున్నారు.
అభ్యర్థులపై అదనపు భారం..
నిజామాబాద్ కార్పొరేషన్‌లో మేయర్ పదవి, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించడంతో మహిళా అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థికంగా అదనపు భారం పడింది. కాంగ్రెస్, బీజేపీ మహిళా ఆశావహుల తరఫున కుటుంబ సభ్యులంతా తిండి, నిద్ర మాని ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ డివిజన్‌తో పాటు పక్క డివిజన్ల బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. బోధన్‌లో చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు రాత్రి 2 గంటల వరకూ వ్యూహాలు రచిస్తూ ఉదయం 5 గంటలకల్లా క్యాడర్‌కు అందుబాటులోకి వస్తున్నారు. ఆర్మూర్, భీంగల్‌లోనూ ప్రధాన పదవులు లక్ష్యంగా అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరి రెండు రోజుల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం మరింత ఉధృతంగా కొనసాగనుంది.
