బతుకుల్లో కరోనా కల్లోలం.. కోలుకోలేకపోతున్నకుటుంబాలు

బతుకుల్లో కరోనా కల్లోలం.. కోలుకోలేకపోతున్నకుటుంబాలు
  • కొన్ని ఫ్యామిలీలో ఇద్దరు ,అంతకు మించి మృతి
  • కోలుకోలేకపోతున్న కుటుంబసభ్యులు
  • ఫ్యామిలీలో ఒకరికి కరోనా సోకినా మిగిలినవాళ్లు
  • మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ల సూచన

ఇంట్లో ఒకరు చనిపోతేనే కుటుంబసభ్యులు కోలుకునేందుకు ఏండ్లకు ఏండ్లు పడుతుంది. అలాంటిది ఒకే కుటుంబంలో రోజుల తేడాతో ఇద్దరు, అంతకుమించి మరణిస్తే.. ఆ విషాదం మాటలకు అందదు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి అనేక కుటుంబాలకు ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తోంది. కొన్ని కుటుంబాల విషయంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో వెయ్యిమందికిపైగా కరోనాకు బలయ్యారు. అన్​ అఫీషియల్​గా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు.

ఆగమవుతున్న కుటుంబాలు

కరోనా కారణంగా చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. హోం ఐసోలేషన్​లో ఉన్నంతకాలం పెద్దగా సమస్య లేకున్నా, ఉన్నట్టుండి పరిస్థితి సీరియస్​ అయితే తమవాళ్లను బతికించుకునేందుకు ప్రైవేట్​, కార్పొరేట్​ హాస్పిటల్స్​కు పరుగుపెడుతున్నారు.అక్కడ లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నా కొందరి ప్రాణాలు మాత్రం దక్కడం లేదు. దీంతో అటు కుటుంబసభ్యులను కోల్పోయి, ఇటు అప్పులపాలై చాలా కుటుంబాలు అలమటిస్తున్నాయి. ఇక ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చనిపోతున్న కుటుంబాలైతే  కోలుకోలేక డిప్రెషన్​లోకి వెళ్తున్నాయి. చెన్నూర్​కు చెందిన చకినారపు భూమయ్య కుటుంబంలో 20 రోజుల వ్యవధిలో ఏకంగా ముగ్గురు చనిపోయారు. వాళ్ల ట్రీట్​మెంట్​ కోసం  రూ.కోటికి పైగా ఖర్చు చేశామని ఫ్యామిలీ మెంబర్స్​ చెబుతున్నారు. ఇంత చేసినా ప్రాణాలు దక్కకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కరోనా బాధితుల కుటుంబాలను స్నేహితులు, బంధువులు కూడా దూరం పెడుతుండటం బాధితులను మరింత కుంగదీస్తోంది. కొందరైతే డిప్రెషన్​లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటివాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదు. కౌన్సెలింగ్​ గానీ, ఆర్థిక సాయంగానీ అందడం లేదు. ఆఫీసర్లు కూడా వాళ్ల మానాన వాళ్లను వదిలేసి పత్తా లేకుండా పోతున్నారు.

ఎందుకిట్ల..?

ఒకే ఇంట్లో ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు కరోనాతో చనిపోవడం వెనుక  ఫ్యామిలీ మెంబర్స్​ దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతుండడమో, ఇమ్యూనిటీ లెవల్స్​ తక్కువగా ఉండడమో  కారణం అయి ఉండవచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇది నిజమో, కాదో తేల్చాలంటే కొంతమందిని స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కాకపోతే ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే మిగిలిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం తేడా అనిపించినా హాస్పిటల్​ ఐసోలేషన్​లో ఉండాలని సలహా ఇస్తున్నారు. కుటుంబంలో ఒకరు చనిపోయినప్పుడు సహజంగానే మిగిలినవాళ్లు డిప్రెషన్​కు లోనవుతారని, అలాంటి వారికి ఆల్రెడీ కరోనా ఉంటే కోలుకోవడం కొంచెం కష్టం కావచ్చని డాక్టర్లు అంటున్నారు. అలాంటి సందర్భాల్లో స్నేహితులు, బంధువులు తాము ఉన్నామంటూ భరోసా ఇవ్వాలని, వారిని వీలైనంత సోషలైజ్​ చేస్తే ఇలాంటి మరణాలను తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు.

కొడుకు చనిపోయిన రెండురోజులకు తండ్రి..

నాగర్ కర్నూలుకు చెందిన బీసం లక్ష్మీనారాయణ జులై 14 న కరోనాతో చనిపోయాడు. ఆయన ఓ పత్రికలో రిపోర్టర్​. లక్ష్మీనారాయణ చనిపోయిన రెండు రోజులకు అంటే జులై 16న ఆయన తండ్రి బాల నారాయణ(70) కూడా మరణించాడు.  ఆ ఇంట్లో మెత్తం నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది.  ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసే లక్ష్మీ నారాయణ భార్యకు కరోనా వల్ల ఉద్యోగం పోయింది. పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో సోదరుడి సాయంతో బతుకు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందుతుందని లక్ష్మీనారాయణ భార్య, ఇద్దరు పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి

సిద్దిపేట పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గంటల వ్యవధిలో కరోనాతో మృతిచెందారు. ఐత లింగం(80), ఆయన భార్య భూలక్ష్మి (75)కి .. సెప్టెంబర్ 1న కరోనా పాజిటివ్​గా కన్ఫామ్​ అయింది. అదేరోజు రాత్రి సిద్దిపేట కొవిడ్​ హాస్పిటల్​కు తరలించారు. రాత్రి 9 గంటలకు భూలక్ష్మి మృతిచెందగా.. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత లింగం మృతి చెందాడు.

ఒకే ఇంట్లో14 మందికి కరోనా.. ఇద్దరి మృతి

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 14 మందికి కరోనా సోకింది. అందులో మామా అల్లుళ్లు ఇద్దరూ రోజుల వ్యవధిలో చనిపోయారు.  లైన్ వాడకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రఘు మామ అశోక్​ జులై 12న హోం ఐసోలేషన్​లోనే గుండెపోటుతో చనిపోయారు. రఘు కరోనాతో పోరాడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్లో జులై 29న మరణించాడు.

చెల్లె, అన్న, తమ్ముడు.. ఒకరి తర్వాత ఒకరు మృతి

మెదక్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన బట్టల వ్యాపారి ఆల్లెంకి ఈశ్వరయ్య కు కరోనా సోకగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ జులై  21న చనిపోయాడు. ఆ కుటుంబం షాక్​ నుంచి తేరుకోకముందే  బట్టల దుకాణం నిర్వహించే ఆయన తమ్ముడు అల్లెంకి నాగభూషణం కూడా జులై 23న కన్నుమూశాడు. కేవలం రెండో రోజుల వ్యవధిలో అన్నదమ్ములిద్దరి మరణంతో ఆ రెండు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. ఈశ్వరయ్య, నాగభూషణం చనిపోవడానికి కొద్ది రోజుల ముందు రామాయంపేటలోని వాళ్ల చెల్లెలు కరోనాతో చనిపోయింది.

మరిది, వదిన మృతి

నిజామాబాద్ జిల్లా బడాభీంగల్​కు చెందిన రిటైర్డ్​ హెడ్మాస్టర్​ ఆడెపు లింబాద్రి ఇంట్లో తొమ్మిది మందికి కరోనా సోకింది. ఈ నెల 8న ఇంటి పెద్ద  లింబాద్రి చనిపోగా.. వారం రోజులు కూడా తిరగ ముందే ఆయన అన్న భార్య ఆడెపు
పద్మాబాయి ఈ నెల 14 న మృతి చెందింది.  ఆ కుటుంబానికి కరోనా సోకిందని తెలియగానే ఎవరూ ఆ దిక్కు చూడలేదు. ఒకరిద్దరు మినహా కనీసం పలకరించి సాయం చేసే వారే కరువయ్యారు. ఒకరి తర్వాత ఒకరికి కరోనా సోకడంతో  లింబాద్రి కుటుంబసభ్యులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఎవరికి ఏమవుతుందోననే టెన్షన్​తోనే  హాస్పిటల్​ పాలయ్యారు.

నెల వ్యవధిలో భర్త, భార్య మృతి

కరీంనగర్​ జిల్లా మానకొండూరుకు చెందిన జ్యోతిష్య పండితుడు, ప్రభుత్వ టీచర్ గర్రెపల్లి రాజశేఖర శర్మ,  ఆయన భార్య స్రవంతి నెల వ్యవధిలో కరోనాతో చనిపోయారు. రాజశేఖరశర్మ కరోనా లక్షణాలతో హాస్పిటల్​లో చేరి ఆగస్టు 12న మృతిచెందగా.. ఆయన భార్య  ఈ నెల 10న చనిపోయింది. తల్లిదండ్రుల మరణంతో వాళ్ల ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. వారి ఆలన పాలన వృద్ధులైన నానమ్మ,
తాతయ్యపై పడింది.

20రోజుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు మృతి

మంచిర్యాలకు చెందిన చకినారపు భూమయ్య(70)కు నలుగురు కొడుకులు. ఇందులో ఒకరు గతంలో చనిపోయారు. ఇటీవల పెద్ద కొడుకు కిరణ్​(45) కు కరోనా సోకింది. అంతలోనే ఇంట్లోని ముగ్గురు చిన్నారులకు కూడా పాజిటివ్​  వచ్చింది. తర్వాత తండ్రి భూమయ్య, తమ్ముడు కిశోర్​కు అంటుకుంది. చిన్నారులు కోలుకోగా.. తండ్రీకొడుకుల పరిస్థితి సీరియస్​గా మారింది. వీరిని హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్  హాస్పిటల్స్​లో చేర్పించగా 25 రోజుల కింద భూమయ్య చనిపోయాడు. తండ్రి  పెద్దకర్మ రోజే ఈ నెల 4న  కిశోర్​ ప్రాణాలు విడిచాడు. మరో నాలుగు రోజులకు  కిరణ్​ చనిపోయాడు. 20 రోజుల తేడాతోనే తండ్రి, ఇద్దరు కొడుకులను కరోనా మింగేయడంతో ఆ కుటుంబం పుట్టెడు దు:ఖంలో మునిగిపోయింది. ట్రీట్​మెంట్​ కోసం అప్పులు తెచ్చి మరీ రూ. కోటికిపైగా ఖర్చు చేశారు.

ఒకరి వెనుక ఒకరుగా ముగ్గురు..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట కు చెందిన అంబ్యాద సరోజన(72) ఆగస్టు 28న కరోనాతో హైదరాబాద్​లో చనిపోయింది. సెప్టెంబర్​ 13న సరోజన పెద్ద కొడుకు రమేష్ (53) , సెప్టెంబర్ 14న చిన్న కొడుకు  సోమేశ్ (51) హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ కన్నుమూశారు.  కేవలం 15రోజుల వ్యవధిలో  ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది.

4 రోజుల గ్యాప్లో తల్లీ కొడుకుల మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నాలుగు రోజుల వ్యవధిలోనే కరోనాతో తల్లీకొడుకులిద్దరూ మృతి చెందారు. పట్టణానికి చెందిన సీర్లంచ లచ్చవ్వ (78) జులై 14న సిద్దిపేటలో కరోనాతో చనిపోయింది. జులై 17న ఆమె కొడుకు సీర్లంచ శ్రీనివాస్ (58) ఇంట్లోనే కరోనాతో చనిపోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరు కరోనాతో మృతి చెందడంతో ఆ చేనేత కుటుంబం ఇంకా కోలుకోలేకపోతోంది. ఇప్పుడా ఫ్యామిలీలో ఏడుగురు ఉండగా.. నిరుపేదలు కావడంతో ఆర్థికంగా ఆదుకునేవాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం తమ దగ్గర బట్టలు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఆ చేనేత కుటుంబం  ఆవేదన చెందుతోంది.

ఇంట్లో ఎవరైనా చనిపోతే మరింత జాగ్రత్తగా ఉండాలి

ఇంట్లో కరోనాతో ఎవరైనా చనిపోతే మిగిలిన వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందరూ టెస్టులు చేయించుకొని డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలి. ఏమాత్రం తేడాగా ఉన్నా హాస్పిటల్​ ఐసోలేషన్​కు వెళ్లాలి. ఇంట్లో ఎవరైనా చనిపోయి డిప్రెషన్​లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్​కు స్నేహితులు, బంధువులు  చేయూతనివ్వాలి. భరోసా కలిగిస్తే తొందరగా క్యూర్​ అవుతారు.

‑ డాక్టర్​ రాజ్​కిరణ్​, అర్బన్​ పీహెచ్​సీ మెడికల్​ ఆఫీసర్​, కరీంనగర్

ఎవరూ దగ్గరికి రాలేదు

నాలుగు రోజుల వ్యవధిలోనే కరోనాతో మా అమ్మ, అన్న చనిపోయారు.  ఎవరూ కనీసం దగ్గరికి రాలేదు. బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. కానీ మా ఇంట్లో కరోనాతో ఇద్దరు చనిపోయారని ఎవరూ మా దగ్గర బట్టలు కొనడం లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియడం లేదు. సాటి మనుషులు వెలివేస్తే కనీసం సర్కారన్నా ఆదుకుంటలేదు.  ఇటీవల వర్షాలకు మా ఇల్లు సగం కూలిపోయింది. కరోనాతో నష్టపోయిన మా లాంటి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి.

‑ ప్రభాకర్​, దుబ్బాక, సిద్దిపేట జిల్లా