‘రియల్’ బిజినెస్.. 100 కి.మీ. లోపు భూములే టార్గెట్

‘రియల్’ బిజినెస్.. 100 కి.మీ. లోపు భూములే టార్గెట్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ చుట్టూ100 కి.మీ లోపు రియల్ ఎస్టేట్​ వ్యాపారం జోరుగా సాగుతోంది. కరోనాతో కొన్నాళ్లు డీలా పడినప్పటికీ ఆర్నెళ్లుగా ఊపందుకుంది. మొన్నటి వరకు సిటీ శివారు ప్రాంతాల్లో బిజినెస్​ చేసినవారు కూడా గ్రామాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎకరం భూమి కోట్లు పలకడమే ఇందుకు కారణం. కొనుగోలు చేసేవారు పెద్ద స్థాయి వారై ఉండడం, వారికి తగిన వ్యక్తులే డీల్​చేస్తుండడంతో మిగిలిన వ్యాపారులకు ఇక్కడ పని లేకుండా పోతోంది. దీంతో సిటీలో ఉంటూనే పల్లెల్లో వ్యాపారం చేస్తున్నారు. 

డైలీ ఉదయం బయలుదేరి వెళ్లి సాయంత్రానికి తిరిగి సిటీ బాట పడుతున్నారు. ప్రస్తుతం సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఎకరం రూ.30 లక్షలలోపు దొరికే పరిస్థితి లేదు. ఐదారేళ్ల వరకు ఎకరం రూ.5 లక్షలు పలికిన భూములు ఐదారింతలు పెరిగాయి. హాట్​కేకుల్లా అమ్ముడవుతుండడంతో రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేసేవారు కూడా అదే తరహాలో పెరుగుతున్నారు. కొందరు సింగిల్​గా బిజినెస్ ​చేస్తుండగా, మరికొందరు సిండికేట్​ అయ్యి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది జాబ్స్​మానేసి ఇదే పని చేస్తున్నారు. 

ఎక్కువగా ఈ జిల్లాల్లోనే..

సిటీకి ఆనుకొని ఉన్న జిల్లాల్లోని భూములు ఒకట్రొండు నెలల్లోనే ఇద్దరు, ముగ్గురి చేతులు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అగ్రిమెంట్లపైనే రీసేల్ అవుతున్నాయి. ఇందులో 5 ఎకరాలలోపు భూములు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఆందోల్, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ నియోజకవర్గాలపై వ్యాపారులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, పరిగి, మహేశ్వరం నియోజకవర్గాల్లో రియల్​భూం కొనసాగుతోంది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ లోని జడ్చర్ల, నాగర్ కర్నూల్, షాద్ నగర్​తదితర నియోజకవర్గాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, నల్గొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని జనగాం నియోజకవర్గంలో వ్యాపారం బాగా ఉన్నట్లు రియల్ వ్యాపారులు చెబుతున్నారు. రోడ్లు కూడా సరిగాలేని ఏరియాల్లోని భూముల ధరలకూ రెక్కలొచ్చాయని, ఎకరం రూ.30 లక్షలు పలుకుతోందని అంటున్నారు. చాలా మంది ఫుల్​టైం వ్యాపారం చేస్తుండగా, కొందరు సిటీలో ఉద్యోగాలు చేస్తూనే ఇదీ చూసుకుంటున్నారు. హాలీడేస్​లో పెట్టుబడిదారులతో కలిసి 4, 5 లొకేషన్లు చూపించుకొని వస్తున్నారు. ఇలా కనీసం నెలకి ఒక బిట్టు సేల్​ చేస్తున్నారు. 

కొనేవాళ్లంతా సిటీ వాసులే..

జిల్లాల్లో భూములను కొనుగోలు చేస్తున్నవారిలో అధిక శాతం హైదరాబాద్​నుంచే ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్, బిజినెస్ మెన్స్ తోపాటు వేరే ప్రాంతాల్లో భూములను విక్రయించిన వారు జిల్లాల్లో ల్యాండ్స్​పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొందరు కొన్నవాటిని డెవలప్ చేసి విక్రయిస్తుండగా, మరికొందరు ఫాంహౌజ్​ల కోసం కొంటున్నారు. ఫాంహౌజ్​కోసం జడ్చర్ల, నాగార్జునసాగర్ రోడ్డు, శ్రీశైలం హైవే, పరిగి, చేవెళ్ల, ఆందోల్, వికారాబాద్ ప్రాంతాల్లో తీసుకుంటున్నారు. 

ఫాంహౌజ్​ల కోసం ఎక్కువగా కొంటున్నరు

సిటీకి 30 కి.మీలోపు ఎకరం రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. పెద్ద స్థాయి వ్యక్తులు తప్ప మిగిలినవారు ఇక్కడి భూములు కొనేందుకు ఇంట్రెస్ట్ ​చూపట్లేదు. 100 కి.మీలోపు అయితే రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లు ఉంది. కాస్త దూరమైనా తక్కువ ధరకు భూములు కొనేందుకు చాలామంది వస్తున్నారు. కరోనాతో ఫాంహౌజ్ కల్చర్ పెరిగింది.  అందుకే శివారు జిల్లాలపై ఫోకస్ పెట్టాం. 

జి.శ్రీనివాస్, రియల్టర్, బాచుపల్లి