
- నాలుగు రోజులకోసారి గడ్డానికి రంగు వేస్తున్నామంటే..
- టెస్టు రిటైర్మెంట్‌పై కోహ్లీ స్పందన
లండన్: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ లాంగ్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంపై స్పందించాడు. లండన్‌లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బాధితుల కోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో క్రిస్ గేల్, రవిశాస్త్రి, కెవిన్ పీటర్సన్‌తో కలిసి పాల్గొన్న కోహ్లీ తాను రెండు రోజుల కిందటే గడ్డానికి రంగు వేసుకున్నానని తెలిపాడు.
‘ ప్రతి నాలుగు రోజులకోసారి గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తోందంటే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం’ అని కోహ్లీ నవ్వుతూ చెప్పాడు. ఈ సందర్భంగా శాస్త్రితో తన అనుబంధాన్ని విరాట్ గుర్తు చేసుకున్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నేను తన(శాస్త్రి)తో కలిసి పని చేయకపోయి ఉంటే టెస్ట్ క్రికెట్‌లో అన్ని విజయాలు సాధ్యమయ్యేవి కావు.
చాలా సందర్భాల్లో తను నాకు అండగా నిలబడ్డారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో ముందుండి విమర్శలను ఎదుర్కొన్నారు. నా క్రికెట్ జర్నీలో కీలక పాత్ర పోషించినందుకు శాస్త్రిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తా’ అని కోహ్లీ పేర్కొన్నాడు. శాస్త్రి కూడా కోహ్లీని ప్రశంసించాడు. గత 15 ఏండ్లలో తను అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్‌గా నిలిచాడని కొనియాడాడు. ‘మీరు వరల్డ్ కప్స్ నెగ్గొచ్చు.. ఇతర విజయాలు సాధించొచ్చు.
కానీ టెస్ట్ క్రికెట్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని విరాట్ కోరుకున్నాడు. కోహ్లీ ఒకసారి తన విజయమంత్రాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్లు దాన్ని అనుసరించాల్సి వచ్చింది. ఈరోజు ఇండియా టెస్ట్ క్రికెట్‌లో ఇంత బాగా ఆడుతోందంటే కారణం కోహ్లీనే. విరాట్ కెప్టెన్సీలో ఆడిన యంగ్‌స్టర్స్ తనకు థ్యాంక్స్ చెప్పాలి. వరల్డ్ క్రికెట్ కూడా అతనికి థ్యాంక్స్ చెప్పాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.