‘ధరణి’లో అక్రమ రిజిస్ట్రేషన్‌..మహిళపై చీటింగ్ కేసు

‘ధరణి’లో అక్రమ రిజిస్ట్రేషన్‌..మహిళపై చీటింగ్ కేసు

నల్గొండ అర్బన్, వెలుగు: ఇదివరకే విక్రయించిన భూమిని ధరణిలో కూతురి పేరున రిజిష్టర్ చేయించిన మహిళపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అక్రమాలకు కారకులైన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం నల్గొండలో కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. పీఏపల్లి మండలంలో 2019 ఆగస్టు 1న జగదీశ్ అనే వ్యక్తికి విజయలక్ష్మి అనే మహిళ 1.34 ఎకరాలు విక్రయించి రిజిష్టర్ చేశారు. అనంతరం జగదీశ్ ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి పలువురికి రిజిష్టర్ చేశారు.

విజయలక్ష్మీ పేరున ఉన్న భూమిని జగదీశ్, తహసీల్దార్ ఆఫీసులో మ్యుటేషన్ చేయించుకోలేదు. అదే భూమిని 2020 నవంబరు 4న విజయలక్ష్మి తన కూతురు ప్రియాంక పేరున ధరణి ద్వారా రిజిష్టర్ చేయించి పాస్ బుక్ తీసుకున్నారు. రెండుసార్లు రిజిష్టర్ చేసి మోసానికి పాల్పడిన విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాలా మార్పిడి అయిన వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా పట్టా పాస్ బుక్ జారీ చేసిన అప్పటి గిర్దావర్ రామాంజనేయులు, వీఆర్వో నిరంజన్ ను సస్పెండ్ చేశామని, రిటైర్డ్ తహసీల్దార్ ఎండీ సమద్ పై చర్యలకు సీసీఎల్ కు సిఫారస్ చేసినట్లు చెప్పారు.