
- వరకట్న వేధింపులే కారణం
ఎల్బీనగర్, వెలుగు: పెళ్లైన రెండు నెలలకే వరకట్న వేధింపులకు ఓ నవ వధువు బలైంది. ఈ ఘటన ఓల్డ్ సిటీలోని బహద్దూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ అసద్ బాబా నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్ లోని భాగల్ పూర్ జిల్లాకు చెందిన రింకి కాటూన్(18), ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు చెందిన తౌహీద్ అలీ(35)కి రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిది వేరే రాష్ట్రాలు అయినప్పటికీ హైదరాబాద్లో సెటిల్ కావడంతో పెద్దలు ఈ పెళ్లి కుదిర్చారు. పెళ్లైనప్పటి నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. పలుమార్లు ఆమెను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన కాటూన్ సోమవారం ఇంట్లో చీరతో ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మానసిక ఇబ్బందులతో గృహిణి..
చందానగర్: మానసిక ఇబ్బందులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానా కన్నాపూర్ గ్రామానికి చెందిన గోవిందరెడ్డి 14 ఏళ్ల క్రితం తన కుమార్తె శోభను అమరేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరు చందానగర్ లోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా శోభ మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఈ నెల 1న రాత్రి హెర్బల్ మెడిసిన్ తాగింది. భర్త చందానగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం
మృతిచెందింది.