ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగిందని..భర్తతో కలిసి చెల్లిని చంపిన అక్క..సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి

ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగిందని..భర్తతో కలిసి చెల్లిని చంపిన అక్క..సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి
  • హత్య చేశాక డెడ్‌‌బాడీని శ్రీశైలం అడవిలో తగులబెట్టిన వైనం
  • అనంతరం కాశీకి వెళ్లిన దంపతులు
  • సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..

సూర్యాపేట, వెలుగు : అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఓ మహిళ తన భర్త సహకారంతో చెల్లిని హత్య చేసింది. డెడ్‌‌బాడీని శ్రీశైలం అడవిలోని ఓ లోయలోకి తీసుకెళ్లి తగులబెట్టిన అనంతరం ఇద్దరూ కాశీకి వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... అనంతగిరి మండలం మొగులాయికోటకు చెందిన గోవిందు, మహాలక్ష్మి భార్యాభర్తలు. 

మహాలక్ష్మి చెల్లెలు నాగలక్ష్మి భర్త ఏడాది కింద చనిపోవడంతో అప్పటి నుంచి తన అక్క వాళ్ల ఇంట్లోనే ఉంది. రెండు నెలల కింద ఏపీలోని ఎన్టీఆర్‌‌ జిల్లాకు చెందిన నరసింహారావుతో రెండో వివాహం జరగడంతో అక్కడికి వెళ్లిపోయింది. కాగా, తన కాళ్ల పట్టీలు తెచ్చుకుంటానని నాగలక్ష్మి  గత నెల 22న తన అమ్మగారి ఊరైన కాల్వపల్లికి వచ్చింది. రెండు రోజులు గడిచినా తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో భర్త ఫోన్‌‌ చేయగా.. షాపింగ్‌‌చేయాల్సి ఉందని అది అయిపోగానే వస్తానని చెప్పింది. 

మరో రెండు రోజులైనా ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్‌‌ స్విచాఫ్‌‌ రావడంతో అనుమానం వచ్చిన నర్సింహారావు నాగలక్ష్మి బంధువులకు ఫోన్‌‌ చేయడంతో తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో ఏప్రిల్‌‌ 24న ఎన్టీఆర్‌‌ జిల్లా చందర్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించగా... నాగలక్ష్మి చివరిసారిగా తన అక్కాబావలైన గోవిందు, మహాలక్ష్మితోనే ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

శ్రీశైలం వెళ్దామని చెప్పి హత్య..

నాగలక్ష్మి తన అక్కాబావకు కొన్ని డబ్బులు అప్పుగా ఇచ్చింది. ఇటీవలే వివాహం జరగడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అక్కాబావపై ఒత్తిడి చేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నాగలక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని గోవిందు, మహాలక్ష్మి నిర్ణయించుకున్నారు. తర్వాత ముగ్గురు కలిసి ఓ కారును రెంట్‌‌కు తీసుకొని శ్రీశైలం బయలుదేరారు. 

మార్గమధ్యలో మిర్యాలగూడ రూరల్‌‌ మండలం ఆలగడప టోల్‌‌గేట్‌‌ సమీపంలోకి వెళ్లాక.. ఇద్దరూ కలిసి నాగలక్ష్మిని కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్‌‌బాడీని శ్రీశైలం అటవీ ప్రాంతంలో సుమారు 200 అడుగుల లోయలోకి తీసుకెళ్లి తగులబెట్టారు. తర్వాత తిరిగి గ్రామానికి వచ్చి తమకేమీ తెలియనట్లు ప్రవర్తించారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి కాశీకి వెళ్లిపోయారు. ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.