- వరంగల్ జిల్లాలో ఘటన
వరంగల్ సిటీ, వెలుగు: కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో సాదు సంగీత(33) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈమె మట్టేవాడలోని గోపాలస్వామి టెంపుల్ ప్రాంతంలో నివాసముంటోంది.
గతంలో ములుగు జిల్లా గణపూర్‌లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో శ్రీధర్ అనే కానిస్టేబుల్ తనను వేధింపులకు గురి చేసినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఆ వేధింపులు భరించలేక గణపూర్ నుంచి భూపాలపల్లికి బదిలీ తీసుకున్నప్పటికీ శ్రీధర్ నుంచి వేధింపులు ఆగలేదని లేఖలో వాపోయింది. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపింది.

