
సికింద్రాబాద్, వెలుగు: జువెలరీ షాప్‌కి వచ్చిన ఓ మహిళ బంగారు కమ్మలు కొట్టేసిన ఘటన మోండా మార్కెట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఏరియాలోని పాట్ మార్కెట్లో సంజయ్ ఉపాధ్యాయ అనే వ్యక్తి స్వతంత్ర జువెలర్స్ పేరుతో నగల షాప్‌ను నడుపుతున్నాడు. ఈ నెల 7న సాయంత్రం జువెలరీ షాప్‌కి వచ్చిన ఓ మహిళ చెవి కమ్మలు చూపించమని అడిగింది. కొన్నింటిని చూసి అవి నచ్చలేదని మరికొన్ని తేవాలని షాపులో పనిచేసే సిబ్బందికి చెప్పింది.
సిబ్బంది మరికొన్ని నగలు తెచ్చేలోగా సదరు మహిళ 11 గ్రాముల చెవి కమ్మలను కొట్టేసి తన బ్యాగ్‌లో దాచింది. కొద్దిసేపటి తర్వాత ఏ నగలు నచ్చలేదని చెప్పి షాప్‌లో నుంచి బయటికి వెళ్లిపోయింది. అయితే, చెవి కమ్మలు పోయినట్లు గుర్తించి షాప్ సిబ్బంది సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మహిళ వాటిని కొట్టేసినట్లు గుర్తించి వెంటనే మోండా మార్కెట్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.