రెండు ఏనుగుల గొడవ.. అన్ని సార్లు ఏనుగు మీద పడే సరికి.. పాపం ఆమె ప్రాణం పోయింది !

రెండు ఏనుగుల గొడవ.. అన్ని సార్లు ఏనుగు మీద పడే సరికి.. పాపం ఆమె ప్రాణం పోయింది !

కొడగు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో విషాద ఘటన జరిగింది. దుబారే ఎలిఫెంట్ క్యాంపులో రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక టూరిస్ట్ చనిపోయింది. చనిపోయిన ఆ మహిళ వయసు 33 సంవత్సరాలు కావడం గమనార్హం. కావేరీ నది ఒడ్డున ఉన్న దుబారేలో ఏనుగుల క్యాంప్ ఫేమస్. హిల్ స్టేషన్ అయిన కూర్గ్ ట్రిప్నకు వెళ్తే టూరిస్టులు తప్పక ఈ ఏనుగుల క్యాంప్ను విజిట్ చేస్తుంటారు. ఇది కర్ణాటక అటవీ శాఖ ఏనుగులకు ఒక ముఖ్యమైన స్థావరం.

దుబారే శిబిరంలో మూడు గంటల పాటు ఏనుగులతో సమయం గడపే అవకాశం ఉంటుంది. ఇందుకు ఛార్జీలు వసూలు చేస్తారు. కావేరీ నదిలో 45 నిమిషాల పాటు ఏనుగులకు టూరిస్టులే స్నానం చేయించవచ్చు. ఇక్కడ ఏనుగుకు దగ్గరగా ఉండి ఏనుగు చర్మం రుద్ది, నూనెతో శుభ్రం చేస్తారు. ఇలా.. కావేరీ నదిలో కనీసం అరడజను ఏనుగులకు స్నానం చేయిస్తుండగా.. కంచన్ అనే ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది.

ఈ రెండు ఏనుగుల గొడవ కారణంగా మిగిలిన ఏనుగులు బెదిరిపోయి అల్లకల్లోలంగా నదిలో పరిగెత్తాయి. మావటీలు ఏనుగులు నియంత్రించడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. ఈ ఏనుగులు గొడవ పడుతున్న సమయంలో వాటికి దగ్గరగా ఉన్న చెన్నైకి చెందిన జ్యునేష్ అనే మహిళపై ఒక ఏనుగు కుప్పకూలిపడింది. కింద పడిన మార్తాం అనే ఏనుగు పదేపదే లేవడానికి ప్రయత్నిస్తూ.. జ్యునేష్‌ను మరింతగా తొక్కేసింది. అక్కడికి దగ్గరలో ఉన్న పర్యాటకులు కొందరు వీడియో రికార్డ్ చేయడంతో ఈ హృదయ విదారక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక వ్యక్తి తన చేతుల్లో పసికందును పట్టుకుని ఉన్నాడు. అయినప్పటికీ.. జ్యునేష్ను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ.. అప్పటికే అన్ని సార్లు ఏనుగు మీద పడే సరికి బాధిత మహిళ ప్రాణాలు కోల్పోయింది.

►ALSO READ | 25 నిమిషాలు.. ఏసీ లేదు.. లైట్లు లేవు.. విమానంలో నరకం

కర్ణాటక అటవీ, జీవావరణ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే బాధిత మహిళ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, వాటి ప్రవర్తనను ఎప్పటికీ పూర్తిగా అంచనా వేయలేమని ఖండ్రే చెప్పారు. పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడం, ఫోటోలకు మరీ దగ్గరగా వెళ్లడం, ఏనుగులకు స్నానం చేయించడం లేదా వాటికి ఆహారం పెట్టడం వంటివి చేయకుండా నిరోధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సందర్శకులు అన్ని వేళలా ఏనుగులు మరియు ఇతర వన్యప్రాణుల నుండి సురక్షిత దూరం పాటించేలా చూడాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.