జూబ్లీహిల్స్, వెలుగు: ఇంటి పని మనుషుల కోసం ఆన్లైన్లో వెతికిన ఓ సివిల్ ఇంజినీర్‌ను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.13లోని శ్రీ సాయి నగర్లో నివసించే బొల్లం కార్తీక్ (34) సివిల్ ఇంజినీర్. ఈ నెల 9న తన ఇంటి పనుల కోసం వంటమనిషి, సహాయకులు కావాల్సి రావడంతో ‘జస్ట్ డయల్’ వైబ్సైట్లో వెతికాడు. ఈ క్రమంలో అమృత, జయలక్ష్మి అనే మహిళలు ఆయనను సంప్రదించారు.
పనికి వస్తామని నమ్మబలికిన సదరు మహిళలు.. అగ్రిమెంట్ చేసుకుందామని, ముందుగా అడ్వాన్స్ డబ్బులు చెల్లించాలని కోరారు. వారి మాటలు నమ్మిన కార్తీక్ గూగుల్ పే ద్వారా రూ.15,500 అడ్వాన్స్‌గా పంపించారు. అయితే, మరుసటి రోజు పనికి రావాలని ఆయన వారికి ఫోన్ చేయగా.. నిందితులిద్దరూ కార్తీక్ నంబర్‌ను బ్లాక్ చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
