ఈ కాలంలోనూ మహిళల డ్రెస్సింగ్పై చర్చా..? మనం తిరోగమన దిశలో ఉన్నట్టే..

ఈ కాలంలోనూ మహిళల డ్రెస్సింగ్పై చర్చా..? మనం తిరోగమన దిశలో ఉన్నట్టే..
  • సంస్కృతిని పాటించని వారూ స్త్రీ గురించి హితబోధ చేస్తున్నరు 
  • నటుడు శివాజీపై చర్యలు తీసుకోవాలి  
  • విమెన్ అండ్ ట్రాన్స్​జెండర్స్​ జేఏసీ

హైదరాబాద్ సిటీ/ పంజాగుట్ట, వెలుగు: ఈ కాలంలో కూడా ఇంకా మహిళలు ఏ బట్టలు వేసుకోవాలి.. ఏవి వేసుకోకూడదు అన్న చర్చ జరుగుతోందని, దీన్ని బట్టి చూస్తే మన సమాజం తిరోగమన దిశలో ఉన్నట్టనిపిస్తోందని విమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ జేఏసీ లీడర్లు అభిప్రాయపడ్డారు. సినిమాల్లో హీరోయిన్లు వేసుకునే బట్టలను నిర్ణయించేది ఎవరని ప్రశ్నిస్తూ, పూర్తిగా బట్టలు వేసుకున్నా లైంగికదాడులు జరుగుతున్నాయి కదా అని వారు కామెంట్​చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. 

జేఏసీ కన్వీనర్ సజయ మాట్లాడుతూ 2022లో ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా స్త్రీలపై నేరాలు 9 శాతం పెరిగాయన్నారు. క్రూరమైన, దుర్మార్గమైన నేరాలు జరిగినప్పుడు మాత్రమే సీరియస్​గా తీసుకుంటున్నారన్నారు. సంస్కృతి పరిరక్షణ పేరుతో కొందరు మితి మీరి మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019లో దిశ ఘటన తర్వాత రాష్ట్రంలో అత్యాచారాలు ఆగిపోతాయని అనుకున్నామని, కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలపై దాడులు, లైంగికదాడుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. 

శివాజీపై యాక్షన్​ తీసుకోవాలి

నిధి అగర్వాల్, సమంతపై దాడి చేసిన వారితో పాటు నటుడు శివాజీపై చర్యలు తీసుకోవాలని జేఏసీ లీడర్లు డిమాండ్ చేశారు. అనసూయను సోషల్ మీడియాలో వేధిస్తున్న 42 మందిపై కేసులు నమోదయ్యాయని, అలాంటి ఆలోచన ఉన్నవాళ్లు ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి విషయాలపై సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు. రీసెర్చర్ తేజస్విని మాడభూషి మాట్లాడుతూ కొత్త విషయాలపై అధ్యయనం చేయాలన్న ఆలోచనలుండగా, ఈ ఆధునిక కాలంలో ఇంకా బేసిక్ విషయాలపై చర్చ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. 

బైకర్, యాక్టర్ శ్వేత వర్మ మాట్లాడుతూ సోషల్ మీడియా పబ్లిక్ కోర్టు కాదని, మహిళల వస్త్రధారణ పబ్లిక్ డిబేట్ కాదన్నారు. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో కనబడే తీరును బట్టి ఆమె వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం తప్పన్నారు. పీఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ 95 శాతం సంస్కృతిని పాటించని వారు భారతీయ స్త్రీ సంస్కృతి గురించి హితబోధ చేస్తున్నారని ఆరోపించారు. చీరలు లేకుండా ఉన్న  సినిమాలు చూడబోమని శివాజీ చెప్పాల్సి ఉండేదన్నారు.

సినిమాల్లో హీరోయిన్లు కట్టుకునే బట్టలను నిర్ణయించేది దర్శకులు, నిర్మాతలే అని...శివాజీ వారికి ఎందుకు చెప్పట్లేదన్నారు. పిల్లలు, మహిళలను సినిమాల్లో కించపరచలేదని డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వీర్ ఆక్టివిస్ట్ దీప్తి, రీసెర్చర్ శ్రావ్య, బాలల హక్కుల సంస్థ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, సంధ్య, అంజలి, సూరేపల్లి సుజాత, రచన ముద్రబోయిన పాల్గొన్నారు.