గవర్నర్ మహిళా దర్బార్ మంచి కార్యక్రమం

గవర్నర్ మహిళా దర్బార్ మంచి కార్యక్రమం
  • రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన మహిళా దర్బార్ లో కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ పబ్ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, నిర్మలా జగ్గారెడ్డి, సునీతారావ్ తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్  నిర్వహిస్తున్న మహిళా దర్బార్ మంచి కార్యక్రమం అని అభినందించారు. ప్రజా దర్బార్ లో భాగంగా మహిళల కోసం మహిళా దర్బార్ ను గవర్నర్ నిర్వహించడాన్ని వారు స్వాగతించారు. 
రాష్ట్రంలో మహిళలు నరకం అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ బాలికల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఘటనల పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని మహిళా కాంగ్రెస్ తరపున గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. మహిళా దర్బార్ మంచి కార్యక్రమం అని మాజీ మంత్రి రేణుకా చౌదరి పేర్కొన్నారు. 
రాష్ట్రంలో రోజుకో చోట అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని, సర్కార్, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందని మరో మాజీ మంత్రి గీతారెడ్డి విమర్శించారు. జూబ్లీ హిల్స్ పబ్ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి రాజ్ భవన్ కు వచ్చామని.. కేసు విషయంలో చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు.