అచ్చంపేట, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో మూడు రోజులుగా తాగునీరు సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఖాళీ బిందెలు, వాటర్ క్యాన్లతో అచ్చంపేట– శ్రీశైలం ప్రధాన రహదారిపై బైఠాయించారు.
సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
