ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానాల్లోనూ మహిళలే .. మున్సిపల్ ఎన్నికల బరిలో 174 మంది మహిళలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానాల్లోనూ మహిళలే .. మున్సిపల్ ఎన్నికల బరిలో 174 మంది మహిళలు
  • రిజర్వ్​ స్థానాలతో పాటు జనరల్  స్థానాల్లోనూ పోటీ

సిద్దిపేట, వెలుగు: మున్సిపల్  ఎన్నికల్లో మహిళలే అగ్రభాగాన నిలుస్తున్నారు. ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తుండగా, రాజకీయాలపై ఆసక్తితో మహిళలు జనరల్  స్థానాల్లోనూ పోటీకి సై అంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉండగా, 326 మంది బరిలో నిలిస్తే అందులో 174 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్  చేసిన స్థానాలతో పాటు జనరల్  స్థానాల్లోనూ మహిళలు పోటీ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

రిజర్వ్​డ్​ వార్డుల్లో పోటాపోటీ..

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీల్లో మహిళలకు రిజర్వ్  చేసిన వార్డుల్లో బహుముఖ పోటీ నెలకొంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లుగా మహిళలు పోటీ పడుతుండడం గమనార్హం. నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉండగా, 36 వార్డులను మహిళలకు రిజర్వ్  చేశారు. దుబ్బాక మున్సిపాలిటీలోని  5వ వార్డులో ఏడుగురు, 6వ వార్డులో 8 మంది, 12,19 వార్డుల్లో ఐదుగురు చొప్పున, 13వ వార్డులో ఏడుగురు మహిళలు పోటీ పడుతున్నారు.

హుస్నాబాద్  మున్సిపాలిటీలోని ఒకటవ వార్డులో ఏడుగురు, 2, 15వ వార్డుల్లో ఐదుగురు చొప్పున, ఏడవ వార్డులో నలుగురు మహిళలు పోటీ చేస్తున్నారు. గజ్వేల్  మున్సిపాలిటీలో ఎస్సీ మహిళకు రిజర్వ్  అయిన  ఒకటవ వార్డులో  ఆరుగురు, బీసీ మహిళకు రిజర్వ్​ అయిన 11 వార్డులో ఏడుగురు, 6, 11 వార్డుల్లో ఐదుగురు చొప్పున మహిళలు పోటీ పడుతున్నారు. చేర్యాల మున్సిపాలిటీలోని జనరల్​​వార్డులో నలుగురు పోటీ పడుతుండగా, హుస్నాబాద్ మున్సిపాలిటీలో జనరల్​ స్థానంలో మహిళా అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండడం గమనార్హం.

మహిళా ఓటర్లే అధికం..

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 1,01,090 ఓటర్ల లో పురుషులు 48,985 , మహిళలు 52,111 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3,146 మంది ఎక్కువగా ఉండడం విశేషం. ఈ ఎన్నికల్లో అన్ని మున్సిపాల్టీల్లోనూ మహిళా ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి.

ప్రచారంలో భర్తలదే పెత్తనం..

ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాలీటీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నా, ప్రచారంలో మాత్రం భర్తలదే పెత్తనం సాగుతోంది. ముఖ్యంగా మహిళలు ఇంటింటి ప్రచారాల్లో భాగంగా చేతులు జోడించి ఓటర్లను అభ్యర్థిస్తుంటే వారి భర్తలు మాత్రం ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇక ఇంటింటి ప్రచారాల్లో అభ్యర్థులతో పాటు మహిళలే పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రచార సభలకు సైతం మహిళలే ఎక్కువగా వస్తున్నారు.

మున్సిపాల్టీల వారీగా మహిళా అభ్యర్థులు

మున్సిపాల్టీ    వార్డులు    మహిళలు    మొత్తం అభ్యర్థులు    మహిళా ఓటర్లు
గజ్వేల్                20                   47                 88                                 24,001
దుబ్బాక             20                   59                  102                               11,117
హుస్నాబాద్     20                   44                   92                                9,673
చేర్యాల            12                    24                  44                                 7,119