మహిళలే మహారాణులు.. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కుర్చీల్లో వాళ్లకే ఛాన్స్

 మహిళలే మహారాణులు.. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కుర్చీల్లో వాళ్లకే ఛాన్స్
  • రిజర్వుడు కంటే ఎక్కువ వార్డుల్లో లేడీస్​ విజయం
  • సత్తుపల్లిలో రెండు పదవులూ మహిళలకే అవకాశం 

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళలే మహరాణులయ్యారు. మున్సిపల్ చైర్​ పర్సన్​, వైస్ చైర్ పర్సన్​ ​పదవులతో పాటు వార్డు మెంబర్లుగానూ 50 శాతానికి మించి ఎన్నికయ్యారు. వార్డు మెంబర్​ స్థానాల్లో రిజర్వుడ్ సీట్ల కంటే ఎక్కువగా, జనరల్​ స్థానాల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. సోమవారం చైర్​ పర్సన్​, వైస్ చైర్ పర్సన్​​ ఎన్నిక పూర్తయిన మున్సిపాలిటీల్లో ఏదో ఒక కుర్చీని మహిళలే దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్​ రెండు పదవుల్లోనూ మహిళలకే ఛాన్స్ దక్కింది.

సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మట్టా రాగమయి ప్రత్యేక శ్రద్ధతో రిజర్వేషన్​ తో సంబంధంలేని వైస్ చైర్ పర్సన్​ స్థానంలోనూ మహిళనే ఎంపిక చేశారు. ఇక అన్ని మున్సిపాలిటీల్లోనూ సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అన్ని చోట్ల కాంగ్రెస్​ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో ఎలాంటి గందరగోళం జరగలేదు. సీల్డ్ కవర్​ లో వచ్చిన పేర్లను సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకు ముందు అధికారులు వారితో ప్రమాణ స్వీకారాలు చేయించారు. 

ఖమ్మం జిల్లాలో ఎన్నికైంది వీళ్లే..!

ఏదులాపురంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని పోకబత్తిని అనిత దక్కించుకున్నారు. వైస్ చైర్మన్ గా తమ్మినేని నవీన్​ ను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 16 మహిళలకు రిజర్వ్ చేయగా, 18 చోట్ల విజయం సాధించారు. జనరల్ మహిళకు రిజర్వు అయిన వైరా మున్సిపల్ చైర్​ పర్సన్​ గా డాక్టర్​ కాపా చంద్రకళ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్​ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను మహిళలకు 10 స్థానాలు రిజర్వు చేయగా, రెండు జనరల్ స్థానాల్లోనూ మహిళలు విజయం సాధించడంతో మొత్తం 12 మంది మహిళలు వార్డు సభ్యులయ్యారు. 

కల్లూరు మున్సిపల్ చైర్మన్​ గా ధరావత్ మోహన్​ ఎన్నిక కాగా, వైస్ చైర్ పర్సన్​ గా శీలం కోటేశ్వరిని ఎన్నుకున్నారు. ఇక్కడ 20 వార్డులకు గాను 10 చోట్ల మహిళలకు రిజర్వు కాగా మొత్తం 12 మంది మహిళలు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. మధిర మున్సిపల్ చైర్ పర్సన్​ గా సామినేని సుజాత ఎన్నిక కాగా, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ గా కోనా ధనికుమార్​ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 11 మహిళలకు రిజర్వ్ కాగా మొత్తం 12 మంది మహిళలు ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో 23 వార్డులకు గాను 11 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మొత్తం 12 మంది వార్డు మెంబర్లుగా గెలిచారు. వీరిలో జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్ పర్సన్ స్థానంలో మహ్మద్ రెహనాబేగం ఎన్నికకాగా, వైస్ చైర్ పర్సన్​ గా మరో మహిళ బొంతు సుమలత ఎన్నికయ్యారు. 

భద్రాద్రి జిల్లాలో ఇలా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​  మేయర్​ గా సీపీఐకి చెందిన మూడ్ గణేష్​ ఎన్నిక కాగా, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్​ కు చెందిన సిరిపురం లలిత ఎన్నికయ్యారు. 60 డివిజన్లున్నఈ కార్పొరేషన్​ లో 30 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయగా, 31 మంది ఎన్నికయ్యారు. అశ్వారావుపేటలో 22 వార్డులకు 11 మహిళలకు రిజర్వ్ కాగా 11 మంది ఎన్నికయ్యారు. చైర్ పర్సన్​ గా జూపల్లి శశికళ, వైస్ చైర్ పర్సన్​ గా జూపల్లి రమేష్​ బాబు ఎన్నికయ్యారు. ఇల్లెందులో 24 వార్డులకు గాను 12 మహిళలకు రిజర్వ్ కాగా, 15 మంది మహిళలు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులు సకాలంలో చేరుకోకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను మంగళవారానికి (ఇవాళ్టికి) అధికారులు వాయిదా వేశారు.