భిక్షాటన చేస్తూ గద్వాలలో మహిళ నిరసన

భిక్షాటన చేస్తూ గద్వాలలో మహిళ నిరసన

గద్వాల,వెలుగు: తన భర్త ఆస్తిని తనకు తెలియకుండా అమ్మిన ఆడపడుచు. ఆమె భర్తపై చర్య తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని  మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన చిట్టెమ్మ అలియాస్ పావని ఆందోళనకు దిగింది. గద్వాలలోని ఆడపడుచు ఇంటి దగ్గర నుంచి ఫ్లెక్సీలు పట్టుకుని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపింది. తన భర్త రెండేళ్ల కింద చనిపోయాడని, తనను సరిగా చూడకపోవడంతో ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని బతుకుదెరువు కోసం కర్నూలు వెళ్లానని, ఇండ్లలో పని చేసుకుంటూ బతుకుతున్నానని చెప్పింది. గతంలో తనకు మూడోసారి ఆడపిల్ల పుడితే తనకు తెలియకుండా అమ్మేశారని ఆరోపించింది.  

తన భర్త కుటుంబానికి అన్ని ఉన్నా.. తమను అనాథలుగా చేశారని వాపోయింది. ఈ మేరకు  జిల్లా కలెక్టరు, ఎస్పీకి, బార్ అసోసియేషన్ కు వినతిపత్రం సమర్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. పావనిని గద్వాలకు చెందిన భగవాన్ దాస్ కొడుకు చంద్రశేఖర్ తో2008లో పెండ్లి అయ్యింది. చంద్రశేఖర్​ రెండేళ్ల కిందట చనిపోయాడు. పెంట్లవెల్లి లో ఉన్న అతని ఆస్తిని అమ్ముకున్నారని, తన అత్త బతికి ఉండగావచ్చిన  పెన్షన్ సొమ్ము కూడా ఆడపడుచులే తీసుకున్నారని ఆరోపించింది. తన మూడో కూతురిని అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు దక్కాల్సిన ఆస్తిని ఇప్పించాలని కోరింది.