- గ్రేటర్‌లో బైక్, ఆటో సర్వీసెస్
- మహిళలు రైడ్ బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లే పికప్, డ్రాప్
- 50 ఈవీ బైక్స్, నాలుగు ఆటోలు అందుబాటులోకి
- స్త్రీ రైడ్‌ను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో ‘ విమెన్ సేఫ్టీ వింగ్’ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ‘స్త్రీ రైడ్’ పేరిట బైక్, ఆటో సర్వీసెస్ ప్రారంభించింది. జిప్పి, ఉబెర్, వోలా, ర్యాపిడో బైక్‌క్యాబ్ సర్విసెస్‌లో మహిళలే డ్రైవర్లుగా ఉన్న బైకులు, ఆటోలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మహిళా ప్రయాణికులు 'Movo Fleet App డౌన్‌లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేసుకుంటే, మహిళా డ్రైవర్లే వచ్చి పికప్ చేసుకొని గమ్యస్థానాలకు చేరుస్తారు. దీంతో యువతులు, మహిళలు నిర్భయంగా ప్రయాణించే వెసులుబాటు కలగనుంది.
ఈ మేరకు 50 ఈవీ బైకులు, నాలుగు ఈవీ ఆటోల ను డీజీపీ సీవీ ఆనంద్ శనివారం ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్, సీఐడీ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీజీపీ సీవీ ఆనంద్, విమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ఆర్టీఏ కమిషనర్ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.
విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్‌లు
సాధారణంగా విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణిలు అత్యవసర ప్రయాణాల కోసం ఎక్కువగా బైక్ క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. కానీ బైక్‌రైడర్‌లుగా యువకులే ఉంటుండడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళా ప్యాసింజర్లు ఎదుర్కొన్న సమస్యలు విమెన్ సేఫ్టీ వింగ్‌దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కమిషనరేట్ సహా గ్రేటర్‌లోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో యువతులే క్యాబ్ డ్రైవర్లుగా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రణాళికలు రూపొందించింది.
మహిళా ఎంపవర్‌మెంట్ ధ్యేయంగా మహిళలు, యువతులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్న మోవో (ఎమ్‌ఓడబ్ల్యూవో) ఆర్గనైజేషన్‌తో కలిసి స్త్రీ రైడ్ ప్రారంభించింది. డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న మహిళలను ఇందుకోసం ఎంపిక చేసింది. 55 మంది మహిళకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించింది. వీరికి ఆర్టీఏ నుంచి డ్రైవింగ్‌లైసెన్సులు జారీ చేయడంతో పాటు వివిధ బ్యాంకుల నుంచి వెహికిల్ లోన్ సమకూర్చింది. ఇలా 50 ఈవీ బైక్‌లతో పాటు నాలుగు ఈవీ ఆటోలను స్త్రీ రైడ్‌పేరిట అందుబాటులోకి తెచ్చింది. రానున్న రోజుల్లో మరికొంత మంది మహిళా డ్రైవర్లకు చేయుతనిచ్చేలా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రణాళికలు రూపొందించింది.
రైడర్ల సంఖ్య పెరగాలి
స్త్రీ రైడ్ మంచి కార్యక్రమం. దీని వల్ల యువతులు, మహిళలు ఎలాంటి భయం లేకుండా జర్నీ చేయవచ్చు. మహిళలకూ ఉపాధి దొరుకుతుంది. ఈ క్రమంలోనే ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం చేట్టాం. మహిళా డ్రైవర్లుగా ఎలాంటి సమస్యలు వచ్చినా అధిగమించాలి. నిరుత్సాహం, భయం వద్దు. ధైర్యంగా ఎదుటి వారికి ప్రోత్సాహం అందించాలి. దేశ జీడీపీలో మహిళలు 50 శాతం ఎకానమీ సాధించాలి. రానున్న రోజుల్లో మహిళా రైడర్ల సంఖ్య మరింత పెరగాలి. - సీవీ ఆనంద్, డీజీపీ
మహిళలకు రక్షణగా ఉంటుంది
అమ్మ, నాన్న పెయింటర్లు. తమ్ముడు చదువుకుంటు న్నాడు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇంటర్ మధ్యలో ఆపేశాను. బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. పేపర్స్ డోర్ డెలివరీ చేస్తుంటాను. విమెన్ సేఫ్టీ వింగ్ సహ కారంతో స్త్రీ రైడ్‌లో చేరాను. మాకు క్యాబ్ సంస్థలతో రైడ్స్ ఇస్తారు. దీని వల్ల నాకు
ఆర్థిక స్వావలంబన, మహిళలకు రక్షణగా ఉంటుంది. -దివ్య, ఫలక్‌నుమా, బైక్ రైడర్
ఆత్మస్తైర్యం పెరుగుతుంది
నాకు డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. భర్త బిజినెస్ చేస్తారు. ఇద్దరు పిల్లలు. విమెన్ సేఫ్టీ వింగ్ సహకారంతో జిప్పి క్యాబ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. స్త్రీ రైడ్ ద్వారా నాకు బుకింగ్స్ వస్తాయి. ఈ ‘స్త్రీ రైడ్’ ద్వారా నాతో పాటు నాతోటి మహిళలకు ఎంతో మేలు జరుతుంది. మాలో ఆత్మస్తైర్యం పెరుగుతుంది.
- స్వాతి, బోయిన్‌పల్లి, బైక్ రైడర్
