భూగర్భ గనుల్లోకి ఇక మహిళా కార్మికులు కూడా దిగనున్నారు. చీకటి గుహల్లాంటి గనుల్లో.. ప్రకృతికి విరుద్దంగా పని చేయడమంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం. అయితే 1952లో కేంద్రప్రభుత్వం భూగర్భగనుల్లో మహిళా కార్మికుల ప్రవేశాన్నినిషేదించింది. ఇపుడు రక్షణ పరిస్థితులు మెరుగుపడడం, ఉద్యోగాలకు తీవ్రపోటీ ఏర్పడటంతో 67 ఏళ్ల తర్వా త మహిళా కార్మికులను కూడా భూగర్భగనుల్లోకి అనుమతిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉదయం 6గంటలనుండి రాత్రి 7గంటల వరకు ఉండే షిప్ట్‌లలో ఇది అమలు కానుంది. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా 56,282 మంది కార్మికులు, ఉద్యోగులు ఉండగా.. వీరిలో కేవలం 1,362మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ మహిళలు కూడా క్లర్క్‌లు, ఆస్పత్రులు, క్యాంటీన్లలో పనిచేసేవారే. సింగరేణి వ్యాప్తంగా 29 అండర్‌గ్రౌండ్, 19ఓపెన్‌కాస్ట్ గనులుండగా.. ఇక కొత్త పనుల్లో కార్మికులు రానున్నారు. భూగర్భగనుల్లో జనరల్ మజ్దూర్, పంప్ ఆపరేటర్, కన్వే ఆపరేటర్, కోల్‌కట్టర్, ఫిట్టర్, హెల్పర్‌తో పాటు మొత్తం 52రకాల హోదాలు భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనులలో ఉన్నాయి.
సింగరేణిలో ప్రస్తుతం పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో వేయి ఖాళీలు భర్తీ కానున్నాయి. అనేకమంది మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. తాజా రిక్రూట్‌మెంట్‌లలో మహిళలకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలో జరగనున్న సేఫ్టీ ద్వైపాక్షికకమిటీ మీటింగ్‌లో మైన్స్ సేఫ్టీ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే మహిళల భూగర్భరిక్రూట్‌మెంట్‌కు గ్రీన్‌సిగ్నల్ పడుతుందని సింగరేణి అధికారవర్గాలు చెబుతున్నాయి.
