అనారోగ్యంతో అతివ అదృశ్య యుద్ధం

అనారోగ్యంతో అతివ అదృశ్య యుద్ధం

ప్రతీ ఏటా మార్చి 8న అంతర్జాతీయ  మహిళా దినోత్సవం సందర్భంగా  ప్రపంచవ్యాప్తంగా  మహిళల విజయాలు, సమస్యలను స్మరించుకునే రోజు, సమానత్వం కోసం పోరాడే రోజు కూడా. 2026 సంవత్సరంలో మార్చి 8న ‘గివ్​ టు గెయిన్’ అనే థీమ్‌‌తో జరుగుతుండడం శుభపరిణామం. 

ఈ సందర్భంగా మహిళలు నోరువిడిచి చెప్పుకోలేని అతి సాధారణమైన, బాధాకరమైన రుతుస్రావ సమస్యను చర్చిద్దాం. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, లక్షలాది మహిళలు, యువతులు ఈ నెలవారీ రక్తస్రావ సమయంలో సరైన హైజీనిక్ సాధనాలు లేకపోవడంతో ఆత్మన్యూన్యత, భయం, అవమాన భావనలతో బాధపడుతున్నారు.   

మెన్స్ట్రువల్ కప్స్ ఒక విప్లవాత్మక పరిష్కారంగా నిలుస్తాయి. ఒక్కసారి కొనుగోలు చేస్తే 5–10 సంవత్సరాలపాటు వాడుకోవచ్చు. పర్యావరణానికి హాని చేయవు,  ఖర్చు తక్కువ, సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, సామాజిక అవగాహన లేకపోవడం, శిక్షణ లేకపోవడం,  సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇంకా చాలామంది దీనిని స్వీకరించలేకపోతున్నారు.  తెలంగాణలో ఇటీవల ప్రాజెక్ట్ శక్తి వంటి కార్యక్రమాలు ప్రారంభమవడం ఆశాజనకం.

రోటరీ, ఎస్బీఐ, యూనిప్యాడ్స్ ఫౌండేషన్ సహకారంతో 60,000 మంది విద్యార్థినులకు రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ పంపిణీ  చేస్తున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఈ సాధనాలను పంపిణీ చేసి ఓరుగల్లు  మహిళా లోకంలో ప్రత్యేక  గుర్తింపు పొందారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక కింద  తెలంగాణలో టీ డయాగ్నస్టిక్స్ ద్వారా 30 రకాల పరీక్షలతో  46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి రంగం సిద్ధం చేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.

అవగాహన కల్పించాలి
రుతుస్రావం ప్రతి మహిళ జీవితంలో  సహజమైన, ఆరోగ్యకరమైన ప్రక్రియ.  అయితే, గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇంకా చాలామంది మహిళలు, యువతులు సరైన హైజీనిక్ ఉత్పత్తులులేకపోవడం, వాటిపై అవగాహన లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రుతుస్రావ కప్పులు సుస్థిరమైన పరిష్కారంగా నిలుస్తాయన్న అవగాహన  లేకపోవడం విచారకరం. దీర్ఘకాలిక ఖర్చు చాలా తక్కువ. 8–12 గంటల వరకు సురక్షితం, సౌకర్యవంతంగా ఉంటాయి.

జన ఔషధి కేంద్రాల్లో సబ్సిడీ రేటుతో  అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకోవాలి.  కర్నాటక ప్రభుత్వం శుచి కార్యక్రమం కింద 2025–26లో 10.38 లక్షల మంది  9–12  క్లాస్  విద్యార్థినులకు  ఉచితంగా  రుతుస్రావ  కప్పులు పంపిణీ చేసి దేశంలోనే  మొదటి స్థాయిలో నిలుస్తోంది.  కేరళ ప్రభుత్వం హరిత  కేరళ మిషన్ ద్వారా  స్కూళ్లు,  కాలేజీల్లో 1.69 లక్షల కప్పులు, ఇన్సినరేటర్లు పంపిణీ చేసి రికార్డులకెక్కింది.

నెలసరి సమస్యలపై  సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇటీవల  సుప్రీంకోర్టు.. మహిళల నెలసరి ఆరోగ్యంను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద  జీవన హక్కుగా గుర్తించింది.  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో (6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) బాలికలకు ఉచితంగా బయోడిగ్రేడబుల్ (పర్యావరణ హితమైన)  శానిటరీ  ప్యాడ్స్ అందించాలి. వెండింగ్ మెషీన్ల ద్వారా టాయిలెట్ ప్రాంగణంలో లభ్యం చేయాలి. 

విడిగా జెండర్-సెపరేట్ టాయిలెట్లు, వసతులు కల్పించాలి. ఇది అమలు చేయకపోతే  స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని, రాష్ట్రాలను జవాబుదారీగా నిలబెడతామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తెలంగాణ టీచర్ల సంఘాలు కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ, ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రేషన్ షాపుల ద్వారా ఉచిత సబ్సిడీ ప్యాడ్స్ అందించాలి 
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా విస్తృత పంపిణీ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది మహిళల ఆరోగ్యానికి దోహదపడుతుంది. రుతుస్రావ కప్పులు కేవలం ఒక ఉత్పత్తి కాదు. ఇది మహిళల స్వావలంబన, ఆరోగ్యం, పర్యావరణ రక్షణకు ఒక అడుగు.

ప్రభుత్వాలు అవగాహనను పెంచి, ఉచిత లేదా తక్కువ ధరలో అందిస్తే లక్షలాది మహిళల జీవితాలు మారతాయి. ఇది కేవలం ఆరోగ్య విషయం కాదు. సమానత్వం,  గౌరవ విషయం!  ప్రతి మహిళకు రుతుస్రావ సమస్యలు అడ్డంకి కాకుండా మహిళా సాధికారతకు బాటలు వేయడమే నిజమైన పురోగతి.

రేణుక గుంటిపల్లి, సర్పంచ్, ముప్పారం గ్రామం, మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.