- మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ, షెడ్యూల్, ఏర్పాట్లపై సెక్రటేరియెట్లో శనివారం సమీక్ష నిర్వహించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ను సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 100 మహిళా సంఘాల భవనాలను సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజు రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
82 అంగన్‌వాడీ కేంద్ర భవనాలను ప్రారంభించి, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు. 26న మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 553 ఆర్టీసీ బస్సులను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నామని, హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 27న జిల్లా కేంద్రాల్లో మహిళా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు, 29న మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
వచ్చే నెల 3న అమ్మ మాట–అంగన్‌వాడీ బాట నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.
