వైభవ్ సూర్యవంశీ (18 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
హరారే: జింబాబ్వే టూర్‌లో ఇండియా శుభారంభం చేసింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (19 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడిన జింబాబ్వే 20 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది.
వెస్లీ మదెవరే (39) టాప్ స్కోరర్. తర్వాత ఇండియా 13.2 ఓవర్లలో 126/3 స్కోరు చేసి నెగ్గింది. మయాంక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం ఇదే వేదికపై జరుగుతుంది.
- బౌలర్లు సూపర్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఇండియా బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ఇన్నింగ్స్ తొలి బాల్‌కే మయాంక్ (2/18).. బ్రియాన్ బెన్నెట్ (0)ను డకౌట్ చేశాడు. రెండో ఎండ్‌లో అదే జోరుతో బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్ (2/19) నాలుగో ఓవర్‌లో బెన్ కరన్ (10)ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో మయాంక్ దెబ్బకు డియాన్ మేయర్స్ (6) ఔటయ్యాడు. దాంతో జింబాబ్వే 26/3 స్కోరుతో పవర్‌ప్లేను ముగించింది. ఎనిమిదో ఓవర్‌లో సికిందర్ రజా (4) వికెట్‌ను శివమ్ దూబే (1/32) తీయడంతో జింబాబ్వే 32/4తో కష్టాల్లో పడింది.
ఈ దశలో రైన్ బర్ల్ (26), వెస్లీ నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 32 రన్స్ జోడించిన బర్ల్‌ను రవి బిష్ణోయ్ (1/24) ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన తడివానాషే మరుమణి (27 నాటౌట్) నెమ్మదిగా ఆడి వికెట్ కాపాడుకున్నాడు. దాంతో ఆరో వికెట్‌కు 58 రన్స్ జత చేసి వెస్లీ రనౌట్ కాగా, ఆ వెంటనే బ్రాడ్ ఇవాన్స్ (0) వెనుదిరిగాడు. ఫలితంగా జింబాబ్వే తక్కువ స్కోరుకే పరిమితమైంది.
- అలవోకగా..
ఛేజింగ్ తొలి ఓవర్‌లో రెండు రన్సే చేసిన వైభవ్.. రెండో ఓవర్‌లో 6, 4, 6తో బ్యాట్ ఝుళిపించాడు. కానీ మూడో ఓవర్‌లో అభిషేక్ శర్మ (8) ఔటయ్యాడు. అయినా తర్వాతి రెండు ఓవర్లలో వైభవ్ 4, 6, 4, 6, 4తో 29 రన్స్ దంచాడు. ఆరో ఓవర్‌లో ఇషాన్ కిషన్ (35) మూడు ఫోర్లు కొట్టడంతో ఇండియా 66/1తో పవర్‌ప్లేను ముగించింది. 7వ ఓవర్ తొలి బాల్‌కు రెండు రన్స్ తీసి వైభవ్ 18 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ తర్వాతి బాల్‌కే ఎంగ్రావ (1/30 )కు వికెట్ ఇచ్చాడు.
రెండో వికెట్‌కు 45 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. 9వ ఓవర్‌లో ఇషాన్ 6, శ్రేయస్ 4 కొట్టారు. దాంతో ఫస్ట్ టెన్ ఓవర్స్‌లో ఇండియా 96/2తో నిలిచింది. 11వ ఓవర్‌లో 4, 6తో 16 రన్స్ రాగా, 12వ ఓవర్‌లో ఇషాన్ ఔటయ్యాడు. తిలక్ వర్మ (6 నాటౌట్) ఫోర్‌తో ఈజీగా మ్యాచ్‌ను గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 125/7 (వెస్లీ 39, మరుమణి 27*, మయాంక్ యాదవ్ 2/18, ప్రిన్స్ యాదవ్ 2/19).
ఇండియా:13.2 ఓవర్లలో 126/3 (వైభవ్ 50, ఇషాన్ 35,
ముజరబాని 2/26).
1మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతి పిన్న వయసు (15 ఏళ్ల, 118 రోజులు)లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ (18 బాల్స్) రికార్డు సృష్టించాడు. నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా (15 ఏళ్ల 340 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
