వర్కవుట్స్ చేస్తే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి

వర్కవుట్స్ చేస్తే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి

ఫిట్‌‌నెస్‌‌ని కోరుకునేవాళ్లందరూ చేసే వర్కవుట్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్ పెడతారు. రావాల్సిన రిజల్ట్ కోసం రోజూ గంటల తరబడి కసరత్తులు చేస్తూ ఉంటారు. అయితే సరైన రిజల్ట్స్ రావాలంటే వ్యాయామం గంటల తరబడి చేస్తేనో, కొత్త కొత్త వర్కవుట్స్ చేస్తేనో సరిపోదు. చేసేది చిన్న వ్యాయామమైనా సరైన పద్ధతిలో చేయాలి.  వర్కవుట్స్ చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైంది ‘ప్రాపర్ ఫార్మ్’.  అంటే  సరైన రూపం లేదా సరైన ఆకృతి అని అర్థం. ప్రాపర్ ఫార్మ్‌‌లో చేస్తేనే కష్టానికి తగ్గ ఫలితముంటది.

జిమ్‌‌లో చేసే వర్కవుట్స్ అయినా, ఇంట్లో చేసే వర్కవుట్స్‌‌కైనా ‘ఫార్మ్’ అనేది కీ రోల్ పోషిస్తుంది. ప్రతి వ్యాయామానికి ఒక పర్‌‌‌‌ఫెక్ట్ ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్‌‌లో చేస్తేనే కండరాలకు అందాల్సిన వ్యాయామం అందుతుంది. చాలామంది వర్కవుట్స్‌‌లో కొన్ని తప్పులు చేస్తుంటారు. దానివల్ల రిజల్ట్స్ రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ఇంట్లో చేసుకునే వర్కవుట్స్‌‌లో అందరూ కామన్‌‌గా చేసే మిస్టేక్స్ ఏంటో, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూద్దాం.  

సిటప్స్

పొట్ట తగ్గడం కోసం,  సిక్స్ ప్యాక్ కోసం చాలామంది చేసే వర్కవుట్  సిటప్స్. సిటప్స్‌‌తో పొట్ట కండరాలు బలంగా తయారవుతాయి. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గించడానికి కూడా సిటప్స్ సాయపడతాయి. అయితే సిటప్స్ చేసే పోశ్చర్ సరిగా లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదముంది. అందుకే సిటప్స్‌‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సిటప్స్‌‌లో.. నేలమీద పడుకుని, కాళ్లు కొంచెం మడిచి, అప్పర్ బాడీని ముందుకు తెస్తుంటారు. అయితే ఈ వ్యాయామం చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్.. బాడీని ముందుకు వంచేందుకు కష్టపడడం. ఎంతో కష్టపడి తలను మోకాళ్లకు వీలైనంత దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వెన్నెముక కూడా బెండ్ అవుతుంది. ఇలా చేస్తే సిటప్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా బ్యాక్ పట్టేసే ప్రమాదముంది.

సిటప్స్ చేసేటప్పుడు వెన్నెముక ఎట్టి పరిస్థితుల్లోనూ బెండ్ చేయకూడదు. వెన్ను నిటారుగా ఉంచి. తలను కూడా సమాంతరంగా ఉంచాలి. చేతులు వెనక్కు పెట్టి శరీరాన్ని లేపగలిగినంత వరకే లేపాలి. పొట్టపై మరీ ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదు.

బ్రిడ్జి

తొడ కండరాలు, వెన్నెముక స్ట్రెచ్ కోసం చాలామంది బ్రిడ్జి వ్యాయామం చేస్తుంటారు. ఇది కూడా చాలా సెన్సిటివ్ వ్యాయామం. రాంగ్ పోశ్చర్‌‌‌‌లో చేస్తే వెన్నెముక రిలాక్స్ అవడానికి బదులు పట్టేస్తుంది. అందుకే బ్రిడ్జి వ్యాయామాన్ని సరిగ్గా చేయాలి. చేతులు కాళ్లు నేలవైపు పుష్ చేస్తూ నడుము భాగాన్ని పైకి లేపేటప్పుడు మోకాళ్ల నుంచి మెడ దాకా బాడీ అంతా స్ట్రైట్ లైన్‌‌లో ఉంచాలి. ఛాతి భాగాన్ని మరీ ఎక్కువగా బెండ్ చేయకూడదు. అలాగే కాళ్లు కూడా 90 డిగ్రీల కోణంలో మడవాలి. అప్పుడే బ్రిడ్జ్ వ్యాయామానికి సరైన రిజల్ట్ కనపడుతుంది.

స్క్వాట్స్

శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించేందుకు స్క్వాట్స్ వర్కవుట్ బాగా ఉపయోగపడుతుంది. స్క్వాట్స్ చేయడం వల్ల బరువు తగ్గటమే కాకుండా, బాడీ స్ట్రెంత్, మెటబాలిజం కూడా  మెరుగుపడుతుంది. స్క్వాట్స్‌‌లో  రెండు కాళ్ల మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి, పాదాలపై నిటారుగా నిలబడాలి.  తర్వాత కుర్చీలో కూర్చున్న విధంగా గోడ కుర్చీ వేయాలి.  అలా గోడ కుర్చీ వేస్తూ, మళ్లీ నిలబడుతూ వ్యాయామం చేయాలి. అయితే మోకాళ్లపై కిందికి వంగే టప్పుడు కాళ్లు స్ట్రైట్‌‌గా ఉండేలా చూసుకోవాలి. కిందికి వంగేటప్పడు రెండు మోకాళ్లు వంచితే స్క్వాట్స్ చేసి ఉపయోగం ఉండదు. అలాగే శరీరాన్ని మరీ ముందుకు వంచకూడదు.  చేతులను గాల్లో ఉంచకుండా రెండు చేతులను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే బాడీ బ్యాలెన్స్ అవుతుంది.

పుషప్స్

అప్పర్ బాడీ అందం కోసం అందరు చేసే ఎక్సర్‌‌‌‌సైజ్ పుషప్స్. పుషప్స్‌‌తో చాతి, భుజాలు, చేతి కండరాలను బలంగా మార్చుకోవచ్చు. పుషప్స్‌‌తో శరీరం బాగా టోన్ అవుతుంది. అయితే పుషప్స్‌‌ను చాలామంది తప్పుగా చేస్తుంటారు. పుషప్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ప్లాంక్‌‌లో లాగానే కాళ్ల నుంచి తల వరకు  శరీరమంతా స్ట్రైట్ లైన్‌‌లోనే ఉండాలి.రెండు చేతులు ఒకే డిస్టెన్స్‌‌లో సమాంతరంగా ఉంచాలి. పుషప్స్ చేసేటప్పుడు రెండు చేతులు ఒకేలా బెండ్ అవ్వాలి. నడుముని పైకి లేపడం గాని కిందకు వదిలేయడం కానీ చేయకూడదు. చేతులు  శరీరం లోపలకు ఉండాలి తప్ప బయటకు ఉంచకూడదు.

ప్లాంక్

ప్లాంక్ ఒక ఫుల్ బాడీ  వర్కవుట్. ఇది శరీరంలోని అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. ప్లాంక్‌‌ను సరిగ్గా చేస్తే పొట్ట, ఛాతి, షోల్డర్స్, బ్యాక్.. ఇలా అన్ని మజిల్స్ గట్టిపడతాయి. అయితే ప్లాంక్‌‌ను చాలామంది తప్పుగా చేస్తుంటారు. మోచేతులను బేస్ చేసుకొని, ముని వేళ్ల మీద ఉండడమే ప్లాంక్ అనుకుంటారు.  ప్లాంక్ ఫార్ములా అదే అయినా చేసే విధానంలో ఒక పోశ్చర్ ఉంటుంది.  ప్లాంక్ చేసేటపుడు తల నుంచి కాళ్ల వరకు స్ట్రైట్ లైన్‌‌లో ఉండాలి. నడుము భాగం కొంచెం కూడా పైకి లేపకూడదు. ప్లాంక్ పొజిషన్‌‌లో ఎక్కువసేపు ఉండడం కష్టంగా అనిపించగానే కొందరు నడుము భాగాన్ని పైకి లేపి ఉంచుతారు. ఈ పొజిషన్‌‌లో కాస్త రిలాక్స్‌‌గా అనిపిస్తుంది. కానీ అది రాంగ్ పోశ్చర్. అలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు. నేల వైపు చూస్తూ శరీరాన్ని స్ట్రైట్ లైన్‌‌లో ఉంచుతూ ప్లాంక్ చేయాలి.