నాగర్‌కర్నూల్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకుంటున్నాయి. గత నెల 5న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రాజెక్టు పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, డిసెంబర్ నాటికి నాలుగు రిజర్వాయర్లను కృష్ణా నీటితో నింపాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గతంలో కేవలం డ్రైరన్లకే పరిమితమైన నార్లాపూర్ (అంజనగిరి) మొదటి లిఫ్ట్ వద్ద అధికారులు వెట్ రన్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఈ నెల 14న మొదటి పంపు వెట్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇంజినీర్లు, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండవ పంపు వెట్ రన్‌ను కూడా సక్సెస్ చేసి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోశారు. మరో వారం వ్యవధిలో మిగిలిన రెండు పంపుల వెట్‌రన్ నిర్వహించి నార్లాపూర్ రిజర్వాయర్ దశలవారీగా నింపుతామని ఇన్చార్జీ ఎస్ఈ రవీందర్ వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో మందగించిన పనులు..
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్ అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా మొదటి పంపు వెట్ రన్ నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత పనులు మందగించాయి. దాదాపు రెండున్నర ఏండ్ల తర్వాత ఈనెల14న మొదటి పంప్ఎలక్ట్రో మెకానికల్ నిర్వహణ పనులు పూర్తి చేసి వెట్ రన్ పూర్తి చేశారు. శుక్రవారం రెండవ పంప్ వెట్ రన్ కంప్లీట్ చేశారు.
మూడు, నాలుగు పంపులను పరీక్షిస్తున్న అధికారులు పవర్‌సప్లై, మోటర్ ఆర్పీఎం తదితర కీలక అంశాలను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు పంపుల ద్వారా 6.4 టీఎంసీ కెపాసిటీ గల నార్లాపూర్రిజర్వాయర్ను డ్యాం సేఫ్టీ నిబంధన మేరకు పూర్తి సామర్థ్యంతో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవీందర్ వివరించారు. మొదటి దశలో రిజర్వాయర్ కెపాసిటీలో 1/3, ఆ ఆర్వాత 2/3 నీటితో నింపినట్లు వివరించారు.
ప్యాకేజీ 3లో మెయిన్టన్నెల్, ప్యాకేజీ4లోని ట్విన్టన్నెల్పనులను త్వరగా పూర్తి చేసి ఏదుల రిజర్వాయర్‌లోని నాలుగు పంపుల వెట్‌రన్ చేపట్టనున్నట్లు తెలిపారు. 2027 డిసెంబర్‌లోగా నార్లాపూర్, ఏదుల, వట్టెం లిఫ్టులు, రిజర్వాయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.
మిషన్ భగీరథకు భరోసా
కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ నుంచి మిషన్‌భగీరథ స్కీంకు నీటి సరఫరా జరిగింది. 2020 అక్టోబరులో జరిగిన ప్రమాదంలో ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ఒక పంపు, మోటర్ పూర్తిగా దెబ్బతినగా, మరో పంపు, మోటర్ పనికిరాకుండా పోయాయి.
ఐదేండ్లుగా రెండు పంపులు మూలకు పడటంతో ఒక పంపు మోటర్‌ను స్టాండ్బైలో ఉంచి రెండు పంపులు మోటర్లతో కేఎల్ఐ స్కీం కింద 4.50లక్షల ఎకరాలకు సాగు నీరు, 3500 గ్రామాలకు మిషన్ భగీరథ స్కీం కింద తాగునీరు సరఫరా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి లిఫ్ట్‌లోని ఎల్లూరు రిజర్వాయర్‌కు లింక్ కెనాల్నిర్మించారు.
దీంతో భవిష్యత్‌లో మిషన్ భగీరథ అవసరాలకు ఎల్లూరు పంప్‌హౌజ్‌పై ఆధాపడే అవసరం ఉండదు. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ఐదేండ్లుగా మూలకు పడ్డ రెండు పంపులు, మోటర్లను రిపేర్ చేయించే అవకాశం ఏర్పడిందని ఇంజినీర్లు అంటున్నారు.
కేఎల్ఐ ఆయకట్టుకు భరోసా..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్, కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్ల మధ్య లింక్ కెనాల్ ఏర్పాటు ద్వారా కేఎల్ఐ స్కీంలోని 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా లభిస్తుందని రవీందర్వివరించారు. నార్లాపూర్ నుంచి ఎత్తిపోసే నీటితో కల్వకుర్తి లిఫ్ట్‌లోని రిజర్వాయర్లు, చెరువులను పూర్తిగా నింపుకుంటే ఆయకట్టు స్థిరీకరణకు కొంత వరకు దోహదపడుతుందన్నారు.
ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి నార్లాపూర్లోనే మకాం వేశారు. మిగిలిన రెండు పంపులను వారంలోగా వెట్ రన్ చేపేట్టేందుకు ఇన్ చార్జీ సీఈ పార్థసారథి, ఎస్ఈ రవీందర్, ఈఈలు లోకిలాల్, అమర్‌సింగ్, ఇతర సిబ్బంది శ్రమిస్తున్నారు.
