
టోక్యో: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆబ్లిక్ సెవిల్లె (జమైకా) గోల్డ్ మెడల్ సాధిస్తాడని వరల్డ్ స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ గతంలో చెప్పిన అంచనా నిజమైంది. ఆదివారం రాత్రి జరిగిన 100 మీటర్ల ఫైనల్లో సెవిల్లె 9.77 సెకన్లతో పర్సనల్ బెస్ట్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఫలితంగా 2017 తర్వాత జమైకాకు మెన్స్ కేటగిరీలో పతకం అందించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
జమైకాకే చెదిన కిషాన్ థాంప్సన్ (9.82 సెకన్లు), నోహ్ లైల్స్ (9.89 సెకన్లు) వరుసగా రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. ఆరంభంలో తనకు గట్టి పోటీ ఇచ్చిన థాంప్సన్‌ను చివరి మీటర్లలో సెవిల్లె సునాయసంగా వెనక్కి నెట్టి వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా టైటిల్‌ను అందుకున్నాడు. 100 మీటర్ల వరల్డ్ రికార్డు హోల్డర్ ఉసేన్ బోల్ట్‌తో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్న 24 ఏండ్ల సెవిల్లె.. గ్లెన్ మిల్స్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. విమెన్స్ 100 మీటర్లలో మెలిసా జెఫర్సన్ వుడెన్ (అమెరికా) 10.61 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం మెరిసింది. ఫలితంగా ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ టైమింగ్‌తో పాటు ఓవరాల్‌గా నాలుగో ఫాస్టెస్ట్ రన్నర్‌గా రికార్డుకెక్కింది. టినా క్లెటాన్ (జమైకా, 10.76 సెకన్లు), జూలియన్ అల్ఫ్రెడ్ (సెయింట్ లూసియా, 10.84 సెకన్లు) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను కైవసం చేసుకున్నారు. ఇక ఇండియాకు చెందిన సర్వేశ్ అనిల్ కుశారే హై జంప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్–బి క్వాలిఫికేషన్స్‌లో సర్వేశ్ 2.25 మీటర్ల ఎత్తు నుంచి దూకి సంయుక్తంగా ఏడో ప్లేస్‌లో నిలిచాడు. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం సాధించాడు. మెన్స్ 10 వేల మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ 29ని.13.33 సెకన్ల టైమింగ్‌తో 16వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.