
లివర్‌పూల్: ఇండియా స్టార్ బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హుడా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్‌తో మెరిశారు. విమెన్స్ 57 కేజీ ఫైనల్లో జైస్మిన్ 4–1 (30–27, 29–28, 30–27, 28–29, 29–28)తో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా జెరెమెటా (పోలెండ్)పై గెలిచింది. కెరీర్‌లో మూడోసారి మెగా టోర్నీలో ఆడుతున్న జైస్మిన్ బౌట్ మొత్తం ఆధిపత్యం చూపెట్టింది. లెఫ్ట్ హుక్స్, అప్పర్ కట్స్‌తో రెచ్చిపోయింది.
తొలి రౌండ్ ముగిసేసరికి 3–2 లీడ్‌లో నిలిచింది. చివరి రెండు రౌండ్లలో రిథమ్‌లో పడిన ఇండియన్ బాక్సర్ కచ్చితమైన పంచ్‌లు విసిరింది. ఒలింపిక్ కేటగిరీలో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. విమెన్స్ 48 కేజీ టైటిల్ బౌట్‌లో మీనాక్షి 4–1తో పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ నజీమ్ కైజైబే (కజకిస్తాన్)పై నెగ్గింది. దాంతో జులైలో జరిగిన వరల్డ్ కప్‌లో నజీమ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. విమెన్స్ 80+ కేజీల్లో నుపుర్ షెరోన్ 2–3తో అగాటా కాజ్మార్స్కా (పోలెండ్) చేతిలో ఓడి సిల్వర్‌ను సొంతం చేసుకుంది. ఇక 80 కేజీ సెమీస్‌లో ఓడిన పూజా బ్రాంజ్ నెగ్గగా.. ఈ టోర్నీని ఇండియా నాలుగు మెడల్స్‌తో ముగించింది.