వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుంది: మంత్రి హరీష్ రావు

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుంది: మంత్రి హరీష్ రావు

వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి ఫోటో వెనక ఫోటో జర్నలిస్ట్ కృషి, శ్రమ ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. పద్యం చిన్నది తాత్పర్యం పెద్దది అన్నట్టుగా.. ఫోటో చిన్నది కానీ దాని వెనక అర్థం పెద్దదని జర్నలిస్ట్ లు ఫోటోలోని భావాలను చిత్రీకరిస్తారని తెలిపారు. 

తెలంగాణ ఉద్యమం సమయంలో జర్నలిస్ట్ ల కృషి మరవలేనిదని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఉస్మానియా యానివర్సిటీలో ఉద్యమ తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపించారని గుర్తుచేశారు. పోలీసుల లాఠీ ఛార్జ్, బులెట్ లు ఉద్రిక్తమైన క్షణంలో.. ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా జర్నలిస్ట్ లు ఫోటోలు తీశారని చెప్పారు. ఆ సమయంలో జర్నలిస్ట్ లు తీసిన ఫోటోలు ఎంతో మందిని కదిలించాయన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫోటో జర్నలిస్ట్ అందరికీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

పత్రికల్లో వార్త చదివింది ఒకఎత్తు.. ఫోటో మరో ఎత్తు.. కొన్నిసార్లు ఫోటో చూస్తే చాలు వార్త అర్థం అవుతుందని తెలిపారు. జర్నలిస్ట్ లు రాత్రి, పగలు తేడాలేకుండా నిత్యం ప్రజల పక్షం నిలుస్తారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అండగా ఉంటుందన్నారు. జర్నలిస్ట్ ల కోసం ప్రెస్ అకాడమీ భవనం కూడా రెడీగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్ట్ లు అంటే మంత్రి హరీష్ రావుకి అమితమైన ప్రేమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మెదక్ జిల్లాలో హరీష్ రావు చొరవతో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు వచ్చాయని తెలిపారు. జర్నలిస్ట్ లకు ప్రభుత్వం హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇస్తుందని పేర్కొన్నారు. ఒక ఫోటో వంద పేజీలు రచనలతో సమానమని వెల్లడించారు. మనిషిలోని ఉద్వేగాలన్నింటిని ఒక ఫోటో ప్రతిబింబిస్తుందని అల్లం నారాయణ చెప్పారు.

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మూడు విభాగాలుగా ఫోటో జర్నలిస్ట్ లకు పోటీ నిర్వహించామని.. ప్రభుత్వ పథకాలు, మానవ జీవితం అనే అంశాలపై ఫోటోలు సేకరించారని తెలిపారు. ఫోటోగ్రాఫర్ లు కూడా జర్నలిస్ట్ లలో భాగమేని స్పష్టం చేశారు. జర్నలిస్ట్ లకు వర్తించే హక్కులన్ని ఫోటోజర్నలిస్ట్ లకు వర్తిస్తాయని అల్లం నారాయణ అన్నారు.