- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లాలాపేట నుంచి ఘట్‌కేసర్ వరకు సాగిన అంతిమయాత్ర
- పాడె మోసి.. తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి
- ఆటపాటలతో 500 మంది కళాకారుల నివాళి
హైదరాబాద్ సిటీ/ఘట్‌కేసర్, వెలుగు: లోక కవి, రచయిత అందెశ్రీకి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం ఉదయం అందెశ్రీ కన్నుమూయగా.. అభిమానులు, ప్రజల సందర్శనార్థం లాలాపేటలోని ఇండోర్‌స్టేడియంలో మంగళవారం ఉదయం వరకూ పార్థివదేహాన్ని ఉంచారు.
ఉదయం 9.30 గంటలకు పోలీసుల గౌరవ వందనంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. లాలాపేట జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగగా, సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అందెశ్రీ పార్థివ దేహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి, స్వయంగా పాడె మోశారు. రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను అందరితో కలిసి ఆలపించారు.
రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల పాటు గౌరవ సూచకంగా కాల్పులు జరిపారు. అనంతరం భార్య మల్లుబాయి, బిడ్డలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువతో కలిసి కొడుకు దత్తసాయి తన తండ్రి అందె శ్రీ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతిమ యాత్రలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
సొంతింటి దగ్గర రెండు గంటలపాటు..
లాలాపేటలో 50 గజాల్లోని ఓ చిన్న పాత ఇంట్లో జీవితాన్ని గడిపిన అందె శ్రీ.. తన భార్య, బిడ్డలకోసం ఓ ఇల్లు ఉండాలని కలలు గన్నారు. ఇటీవలే ఘట్‌కేసర్‌లో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆయన మనసు, మమకారం అంతా ఆ ఇల్లు చుట్టూనే ఉందని భావించిన కుటుంబీకులు.. పార్థివ దేహాన్ని అక్కడ రెండు గంటల పాటు ఉంచారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు పక్కన ఉన్న స్మృతి వనానికి మంత్రులు, నాయకులు, అభిమానులు, భారీ జనసందోహం మధ్య అంతిమ యాత్ర కొనసాగింది.
హోరెత్తిన అభిమానం.. మార్మోగిన పాటలు
వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అభిమానులతో అందెశ్రీ అంతిమ యాత్ర, స్మృతివన ప్రాంగణం కిక్కిరిసింది. ఆయన పార్థివదేహాన్ని చూసిన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఘట్‌కేసర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్దకు 500 మంది కళాకారులు ఆటపాటలతో అంతిమయాత్ర కొనసాగించారు. ‘అమర్ రహే అందె శ్రీ’ అంటూ నినదించారు. తమ అభిమాన కవి, గాయకుడికి పాటలతో వీడ్కోలు పలికారు.
