అపాచీ హెలికాప్టర్లు.. ఆకాశంలో శత్రువును వెంటాడి వేటాడి అటాక్ చేయగలవు. గన్నుల నిండా బుల్లెట్లు నింపుకుని దాడి చేసేయగలవు. రాకెట్లను విసరగలవు. అంతటి శక్తిమంతమైన అపాచీ హెలికాప్టర్లు ఆర్మీలోకి వచ్చేశాయ్. నాలుగు అపాచీలు శనివారం భారత వాయు సేన వాకిట్లో వాలిపోయాయి. దీంతో ఇండియా దగ్గర ఉన్న తొలి అటాకింగ్ హెలికాప్టర్‌గా అపాచీ పేరు తెచ్చేసుకుంది.
ఘజియాబాద్‌లోని హిందన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో భద్రతా బలగాలు ఈ ఏహెచ్–64ఈ వెర్షన్ హెలికాప్టర్లను రిసీవ్ చేసుకున్నాయి. మరో నాలుగు వచ్చే వారం వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటన్నింటినీ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు పంపిస్తారు. సెప్టెంబర్‌లో అధికారికంగా ఆర్మీలోకి వాటిని తీసుకుంటారు. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో అమెరికాతో ఒప్పందం చేసుకుంది. మిగతా హెలికాప్టర్లు 2020 నాటికి వచ్చే అవకాశం ఉంది.

