సర్కార్​ నిర్లక్ష్యంతో అధ్వాన్నంగా ట్రిపుల్​ ఐటీ

సర్కార్​ నిర్లక్ష్యంతో అధ్వాన్నంగా ట్రిపుల్​ ఐటీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో బాసర ట్రిపుల్​ఐటీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. రెగ్యులర్​ వీసీ, డైరెక్టర్, స్టూడెంట్లకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరని విమర్శించారు. ట్రిపుల్​ ఐటీ పరిస్థితిపై ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు ల్యాబ్​ అసిస్టెంట్లతో పాఠాలు చెప్పించే పరిస్థితి ఉందని ఆరోపించారు.

రేకుల షెడ్లలో క్లాసులు చెప్తున్నారని, ఏసీలు పనిచేయడం లేదని, ఫ్యాన్లు కూడా లేవని, కుర్చీలు, డిజిటల్​ బోర్డులు, డెస్క్​లు పాడయ్యాయని, ప్రొజెక్టర్​ పనిచేయడం లేదంటూ ఆయన ట్రిపుల్​ ఐటీలోని సమస్యలను వివరించారు. స్టూడెంట్లకు ల్యాప్​టాప్​లు ఇవ్వట్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. హాస్టల్​లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. 9 వేల మంది విద్యార్థులకు 3 మెస్​లే ఉన్నాయని సోయం ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల భోజనం పెడ్తున్నారని, ఒక్కోసారి కప్పలు కూడా వస్తున్నాయని మండిపడ్డారు. ఫీజుల ద్వారా ఏటా రూ.40 కోట్ల ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. సర్కారు సమస్యలను పరిష్కరించకపోతే.. బీజేపీ తరఫున ఆందోళనలకు దిగుతామన్నారు.