WPL 2024: ఆశా పాంచ్ పటాకా.. ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ విజయం

WPL 2024: ఆశా పాంచ్ పటాకా.. ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ విజయం

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజ‌న్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) విజయంతో ప్రారంభించింది. శనివారం(ఫిబ్రవరి 24) యూపీ వారియ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ మహిళా జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మందాన సేన 157 పరుగులు చేయగా.. ఛేదనలో యూపీ వారియర్జ్ విజయానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయారు. తొలి మ్యాచ్‌లానే రెండోది ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టాపార్డర్ విఫ‌లమైనా మిడిలార్డర్ రాణించ‌డంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగారు. రీచా ఘోష్‌(62), తెలుగ‌మ్మాయి స‌బ్బినేని మేఘ‌న‌(53)లు హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. స్మృతి మంధాన(13), సోఫె డెవిన్(1), ఎలీసా పెర్రీ(8), విఫలమయ్యారు. యూపీ బౌల‌ర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లు తీసింది

అనంతరం 158 పరుగుల ఛేదనలో యూపీ వారియర్జ్ విజయానికి 2 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. వారియర్జ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా, ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. బెంగ‌ళూరు బౌలర్లలో శోభన ఆశా 5 వికెట్లు పడగొట్టి యూపీ ఓటమిని శాసించింది.