- మూడు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మల్ల యోధులు
కామారెడ్డి జిల్లా: ప్రస్తుతం యువత మొబైల్ గేమ్స్.. తాజాగా పబ్జీ గేమ్స్ తో బిజీ అయింది. ఏదో మొక్కుబడిగా వాకింగ్ చేసి వ్యాయామం పూర్తయింది అంటున్నారు చాలా మంది. అయితే భిన్న సంస్కృతులున్న కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో కుస్తీ పోటీలకు మంచి ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. టీ20 మ్యాచులు ఉన్నా జనం కుస్తీ పోటీలుంటే మాత్రం టీవీలు కట్టేసి కుస్తీకే సై అంటున్నారు.
ఎలమస పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామంలో ఖండోబా జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో కుస్తీ పోటీలకు మూడు రాష్ట్రాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా వచ్చి కుస్తీ పోటీలను తిలకించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరను ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. చుట్టూ జనం బాజా భజంత్రీలు, ప్రేక్షకుల కేరింతలు కుస్తీ పోటీల్లో పాల్గొనే వారిని ఉత్సాహ పరిచాయి. సై అంటే సై అంటూ పోటీ పడుతుంటే కేరింతలు మిన్నంటాయి.
మూడు రాష్ట్రాల కూడలి అయిన ఈ ప్రాంతంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక ఉమ్మడి వాతావరణం భిన్నంగా కనిపించింది. తెలుగు, హిందీ, కన్నడతోపాటు మరాఠీ భాషలు కూడా మాట్లాడే ఈ ప్రాంతంలోని జీవన విధానంపై ఆసక్తితో మూడు రాష్ట్రాల వారు తరలివచ్చారు. పురాతన ఆచారాలు, సంస్కృతులు గుర్తు చేసుకుంటూ ఉల్లాస వాతావరణంలో కుస్తీ పోటీలు జరిగాయి. ఏ చిన్న పండుగ జరిగినా కుస్తీ పోటీలు నిర్వహించే ఆనవాయితీని ఈసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించారు.
