ఓవల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌‌..

ఓవల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌‌..

లండన్‌‌: వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ)–2027 ఫైనల్‌‌ మ్యాచ్‌‌కు లండన్‌‌లోని ప్రసిద్ధ ‘ది ఓవల్‌‌’ గ్రౌండ్‌‌ వేదిక కానుంది. జూన్‌‌ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్‌‌ జరుగుతుందని ఐసీసీ గురువారం ప్రకటించింది. 2027, 2029, 2031 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌‌ల ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గత ఏడాదే దక్కించుకుంది. 

దాంతో ఆయా ఎడిషన్ల మ్యాచ్ వేదికలను నిర్ణయించే బాధ్యతను కూడా ఈసీబీకే అప్పగించారు. ఇప్పటివరకు జరిగిన మూడు ఫైనల్స్ యూకేలోనే జరిగాయి. ఓవల్ మైదానంలో ఫైనల్ జరగడం ఇది రెండోసారి. 2023 ఫైనల్లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 

మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ ఆసక్తికరంగా మారింది. ఫైనల్ రేసులో తొమ్మిది జట్లు పోటీపడుతున్నాయి. ఎనిమిది టెస్టుల్లో ఏడు గెలిచిన ఆస్ట్రేలియా (87.50) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ప్రస్తుత చాంపియన్ సౌతాఫ్రికా (75) రెండో స్థానంలో ఉంది.