
లండన్‌లోని ఓవల్‌లో టీమ్‌ఇండియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ (146*) సెంచరీ, స్టీవ్ స్మిత్ (95*) పరుగులతో కదం తొక్కడంతో ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు బిగినింగ్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ తరువాత దూకుడుగా ఆడుతున్న డేవిడ్ వార్నర్ (43) శార్దూల్ ఠాకూర్ వేసిన 21.4 ఓవర్‌కు వికెట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. లంచ్‌కు ముందు వార్నర్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాకు.. లంచ్ తరువాత మరో షాక్ తగిలింది. లంచ్ నుంచి వచ్చి రాగానే మార్నస్ లబుషేన్ (26)ను షమీ బౌల్డ్ చేశాడు.
ఆ తరువాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్ 106 బంతుల్లోనే సెంచరీ చేశాడు. హెడ్ ఇన్నింగ్స్ లో15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరోవైపు స్టీవ్ స్మిత్ కూడా నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్, షమీ చెరో వికెట్ తీశారు.